ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్.. తప్పుదారి పట్టించిన వ్యక్తి అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 09:25 PM

కర్ణాటకలోని ధర్మస్థల ఆలయం సమీపంలో 'సామూహిక అత్యాచారాలు, హత్యలు, ఖననాలు' జరిగాయని తీవ్రమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించాయి. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నిర్వహించిన విచారణలో ఆ వ్యక్తి చేసిన వాదనలు పూర్తిగా అబద్ధమని, కల్పితమని తేలడంతో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా, సమాచారం అందించిన వ్యక్తిగా చెప్పుకున్న సిఎన్ చిన్నయ్య అలియాస్ చెన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గాను పోలీసులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.


మొదట చిన్నయ్య తనను తాను 'విజిల్ బ్లోయర్'గా పేర్కొంటూ ముసుగు వేసుకుని మీడియా ముందుకు వచ్చారు. ధర్మస్థల ఆలయం సమీపంలో ఉన్న మంజునాథ స్వామి ఆశ్రమంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరిగాయని.. వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 100కు పైగా చిన్నారులు, మహిళల మృతదేహాలను తానే స్వయంగా పూడ్చి పెట్టిన్లు చెప్పాడు. ఈ సంచలన ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా కలకలం సృష్టించాయి. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని అనేక డిమాండ్లు వచ్చాయి.


ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. SIT అధికారులు చిన్నయ్యను రోజుల తరబడి విచారించారు. మరోవైపు అతడు చెప్పిన చోట తవ్వకాలు కూడా జరిపారు. ఎన్ని రోజుల పాటు తవ్వకాలు చేపట్టినా అక్కడ ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. మరోవైపు ఆయన చెప్పిన వివరాలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన లేకపోవడంతో.. మరింత గట్టిగా దర్యాప్తు చేశారు. సాక్ష్యాలను మరోసారి పరిశీలించారు. ఈక్రమంలోనే సిఎన్ చిన్నయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మొహంతీ అతడిని ఆరా తీశారు.


ఈ విచారణలోనే చిన్నయ్య చెప్పేవన్నీ అబద్ధాలేనని తేల్చారు. కావాలనే అతడు మాయ మాటలు చెప్పి మొత్తం వ్యవస్థను నమ్మించాడని.. ఇప్పుడు తనకేమీ తెలియదంటూ చేతులు ఎత్తేస్తున్నాడని విచారణ బృందం గుర్తించింది. ఈక్రమంలోనే అతడిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరు పరచబోతుంది. మరోవైపు ఈ కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వైద్య విద్య చదువుతున్న తన కుమార్తె అనన్య భట్.. 2003లో ధర్మస్థల వెళ్లి అదృశ్యం అయిందంటూ ఆమె ఫిర్యాదు చేసి.. మళ్లీ ఆ కేసును వెనక్కి తీసుకుంది. తాను చెప్పిందంతా అబద్ధమేనని పేర్కొంది. దీంతో ఈరోజు ఉదయం పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. అదుపులోకి తసుకోనున్నట్లు తెలుస్తోంది.


ఈ కేసు మొదలైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ వివాదం నడిచింది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ధర్మస్థల ఆలయం పరువును ప్రభుత్వం కాపాడలేకపోతోందని ఆరోపించింది. అయితే తాజాగా ఫిర్యాదుదారు అరెస్ట్ కావడంతో ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి సరైనదేనని తేలింది. ఈ పరిణామం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపుగా మారింది. ఒక వైపు ప్రభుత్వం పారదర్శకతను పాటిస్తూ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు ఈ కేసులో నిజానిజాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa