ఆ యువకుడి, ఇద్దరమ్మాయిలు ఒకేచోట పనిచేస్తున్నారు. అప్పటికే యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు.. మళ్లీ ఆమెకు తెలియకుండా అక్కడే పనిచేస్తున్న మరో అమ్మాయితో కూడా లవ్ ట్రాక్ నడిపాడు. ఇంతలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఊహించని మలుపు తిరిగింది. ఓ నిండు ప్రాణం బలైంది. అనంతపురం సాయినగర్ మూడో క్రాస్‌లో ఉన్న ఓ బ్లడ్ బ్యాంకులో గుత్తికి చెందిన అరుణ్ కుమార్, మరో యువతి భారతి, పెనుకొండ మండలానికి చెందిన మరో యువతి స్వాతి పనిచేస్తున్నారు.
అరుణ్, భారతిలు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు.. అక్కడే పనిచేస్తున్న స్వాతి కూడా వీరితో సన్నిహితంగా ఉంటోంది. ఇంతలో అరుణ్ భారతికి తెలియకుండా స్వాతితో కూడా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతలో అరుణ్, స్వాతిల ప్రేమ వ్యవహారం భారతికి తెలిసింది. ఆమె కోపంలో సోమవారం ఉదయం స్వాతికి ఫోన్ చేసింది.. ఆమెను తిట్టింది. 'నా ప్రియుడితో ప్రేమ ఎలా నడుపుతావు.. మమ్మల్ని అన్నా వదినా అంటూ పిలిచావు కదా.. మీ ఇద్దరి వ్యవహారం నాకు తెలిసిపోయింది. ఈ రోజు ఆఫీసుకు రండి మీ సంగతి తెలుస్తా' అంటూ వార్నింగ్ ఇచ్చింది.
భారతి హెచ్చరించడంతో స్వాతి భయపడింది.. ఆమె ఉంటున్న ప్రైవేట్ హాస్టల్‌లో ఎవరూలేని సమయం చూసి రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి వెంటనే ఆమెను కిందకు దించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించార. కానీ అప్పటికే స్వాతి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. స్వాతి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వివరాలు ఆరా తీసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇలా ఒకే యువకుడ్ని ఇద్దరు ప్రేమించడం.. ఇద్దరు ప్రియురాళ్ల మధ్య వివాదంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. పాపం భారతి బెదిరించడంతో భయపడిపోయి ప్రాణాలు తీసుకుంది. స్వాతి మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa