ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లి.. మరొకరిని వివాహమాడి తొరిగొచ్చింది

national |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 08:24 PM

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన.. ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘జబ్ వుయ్‌ మెట్’ సినిమా కథను తలపించింది. ప్రేమికుడిని పెళ్లాడేందుకు ఇల్లు వదిలి పారిపోయిన ఒక యువతి.. అనూహ్యంగా మరొకరిని పెళ్లాడి తిరిగి ఇంటితి రావడంతో ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ యువతి తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తూ సంతోషకరమైన ముగింపునకు చేరుకున్నాయి. మరి ఆ కథ ఏంటో మనమూ ఇప్పుడు తెలుసుకుందామా..?


ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన 18 ఏళ్ల శ్రద్ధా తివారీ అనే యువతి సార్థక్ అనే తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. పెద్దల అంగీకారం లభించదని భావించి ఆగస్టు 23వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. రైల్వే స్టేషన్‌లో ప్రియుడి కోసం ఎదురు చూసింది. గంటలు గడుస్తున్నా అతడు అక్కడికి రాకపోవడంతో.. పదే పేద ఫోన్ చేసింది. మొదట్లో ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా చివరకు ఫోన్ లేపాడు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. ఊహించని ఈ పరిణామంతో శ్రద్ధా మనసు పూర్తిగా విరిగిపోయింది.


ఎటు వెళ్లాలో తెలియక, ఏం చేయాలో తోచని స్థితిలో కనిపించిన రైలు ఎక్కేసింది. ఆ రైలు ఆమెను రత్లామ్ అనే పట్టణానికి తీసుకెళ్లింది. అక్కడ రైలు దిగిన శ్రద్ధా తివీరా.. ఓ బెంచీపై కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ, తనలో తానే మదన పడుతూ కూర్చుంది. అయితే అప్పుడే అక్కడకు శ్రద్ధా చదివిన కాలేజీలోనే చదువుకున్న కరణ్ అనే యువకుడు వచ్చాడు. కంటతడి పెడుతూ కూర్చున్న శ్రద్ధను చూసి ఏమైందని అడిగాడు. అప్పటి వరకు తనలో తాను బాధతో కుంగిపోయిన శ్రద్ధకు.. తెలిసిన వ్యక్తి కనిపించగా అతడిని పట్టుకుని ఏడ్చేసింది. తనకు జరిగిందంతా చెప్పేసింది. దీంతో అతడు తిరిగి ఇంటికి వెళ్లిపోమని సూచించాడు.


కానీ శ్రద్ధా తివారీ అందుకు అంగీకరించలేదు. పెళ్లి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్లలేనని.. అలా వెళ్తే తాను బతికి ఉండలేనని స్పష్టం చేసింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న కరణ్.. క్షణం కూడా ఆలోచించకుండా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుకు శ్రద్ధా కూడా సరేనని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మహేశ్వర్-మండలేశ్వర్‌కు వెళ్లి అక్కడి ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి మందసౌర్‌కు బయలుదేరారు. మధ్యలో హోటల్ గది దొరకకపోవడంతో.. శ్రద్ధా తన తండ్రి అనిల్ తివారీకి ఫోన్ చేసి, తాను సురక్షితంగా ఉన్నానని, పెళ్లి కూడా చేసుకున్నానని తెలిపింది. మొదట షాక్‌కు గురైన ఆమె తండ్రి.. ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని వారిద్దరికీ ఇండోర్‌కు తిరిగి రావడానికి రైలు టికెట్ల కోసం కొంత డబ్బు పంపించాడు.


విధి ఆడిన నాటకంలో ఇద్దరూ చివరికి ఇండోర్ చేరుకున్నారు. కరణ్ స్వయంగా శ్రద్ధాను ఇండోర్‌లోని ఎంఐజీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు శ్రద్ధా తండ్రి అనిల్ తివారీకి సమాచారం అందించారు. శ్రద్ధా, కరణ్ ఇద్దరినీ పోలీసులు వారి తండ్రి ముందు ప్రవేశపెట్టారు. అన్ని విషయాలు తెలుసుకున్న అనిల్ తివారీ.. మొదట కొద్దిగా కలత చెందినా, ఆ తర్వాత తన కూతురు క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించారు. తన మొదటి ప్రియుడిని మరిచిపోయి, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆమె సిద్ధపడటం చూసి ఆయన కూడా వీరి పెళ్లికి అంగీకరించారు. అయితే వారని ఓ పది రోజుల పాటు విడిగా ఉంచుతానని.. ఆ తర్వాత కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకోవానుకుంటే వివాహం జరిపిస్తానని హామీ ఇచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa