ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారింది. కొంతమందికి నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది. మరికొందరు రోజంతా అలసిపోయినట్లు భావిస్తారు. అందుకే ఒత్తిడి నిర్వహించడం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ప్రాణాయామం వంటివి లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవాలి. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఒక్కో ఆసనానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందులో శవాసనం ఒకటి. ఇది సరళమైన, ప్రయోజనకరమైన యోగాసనం. ప్రతి ఒక్కరూ సింపుల్‌గా చేయగల ఆసనం. ప్రతి రోజూ ఐదు నిమిషాలు శవాసనం వేయడం వల్ల ఏం జరుగుతుందో, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజూ ఐదు నిమిషాలు శవాసనం వేస్తే ఏమవుతుంది?
శవాసనం అనేది విశ్రాంతినిచ్చే భంగిమ. ఈ భంగిమలో మనం నేరుగా వీపు మీద పడుకుని శరీరమంతా వదులుగా ఉంచుతాం. ఇది చాలా తేలికగా కనిపిస్తుంది కానీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఐదు నిమిషాలు శవాసనం వేయడంలో శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శవాసనంలో ఉన్నప్పుడు మనస్సు పూర్తిగా ప్రశాంతంగా, విశ్రాంతిగా ఉంటుంది. ఇది శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది నిరాశ, ఆందోళన, అతిగా ఆలోచించడం వంటి సమస్యల నుంచి రిలీఫ్ అందిస్తుంది.
ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి శవాసనం బెస్ట్ ఆప్షన్. ఐదు నిమిషాలు శవాసనం వేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇది శరీరానికి లోతైన విశ్రాంతిని ఇస్తుంది. ఇది రోజూ చేయడం వల్ల సులభంగా నిద్రలోకి జారుకోవచ్చు. శవాసనం చేసేటప్పుడు, శరీర జీవక్రియ మందగిస్తుంది. ఇది రక్తపోటు, హృదయం స్పందనను సరిచేస్తుంది. అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత వ్యాధి ఉంటే, ప్రతిరోజూ 5 నిమిషాలు చేయడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. శవాసనం రోజులోని అలసటను, కండరాలలో ఉద్రిక్తతను తొలగించడానికి సాయపడుతుంది. ఇది శరీర కండరాలను తెరుస్తుంది. అంతేకాకుండా శక్తి స్థాయిల్ని పెంచుతుంది. శవాసనం వేయడం వల్ల శరీరం లోపలి నుంచి విశ్రాంతి పొందుతుంది. శవాసన సమయంలో ఏకాగ్రత వహించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
జీర్ణసమస్యలకు చెక్
ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణసమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి శవాసనం మంచి ఆప్షన్. ఈ యోగాసనంలో లోతైన శ్వాస, విశ్రాంతి కారణంగా, జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. రోజూ ఐదు నిమిషాలు శవాసనం వేయడం జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
శవాసనం ఎలా వేయాలి?
* ముందుగా, మ్యాట్ మీద మీ వీపుపై పడుకోండి.
* ఇప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచండి. కళ్ళు మూసుకుని రెండు కాళ్ళను వేరు చేయండి.
* పాదాల రెండు వేళ్లను పక్కలకు వంచి ఉంచాలి.
* చేతులను శరీరం నుంచి కొంచెం దూరంగా ఉంచండి.
* మీ అరచేతులను తెరిచి పైకి ఉంచాలి.
* ఇప్పుడు నెమ్మదిగా శరీరంలోని ప్రతి భాగంపై దృష్టి పెట్టండి.
* మీ శ్వాసను నెమ్మదిగా ఉంచుకోవాలి.
* మీరు క్రమంగా శ్వాస వేగాన్ని పెంచుకోవచ్చు.
* గుర్తుంచుకోండి శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోవాలి కానీ నిద్రపోకూడదు.
* ఇలా కొద్దిసేపు చేసిన తర్వాత నెమ్మదిగా తిరిగి యధాస్థానంలోకి రండి.
గుర్తించుకోవాల్సిన విషయాలు
* ఈ ఆసనం వేసేటప్పుడు చాలా మంది నిద్రపోతారు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
* శవాసనం వేసే ముందు ఫోన్‌ను దూరంగా పెట్టండి. లేదంటే మీకు అవాంతరం కలిగించవచ్చు.
* అంతేకాకుండా శవాసనం వేసే సమయంలో మనసులోకి ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి. నెగటివ్ థాట్స్ వల్ల శవాసనం వేసినా ఫలితం ఉండదు.
* చాలా మంది దీనిని సులభమైన ఆసనం అనుకుంటారు. నిపుణుల ప్రకారం ఇది కఠినమైన ఆసనం. శవాసనం వేసినప్పుడు మీరు రిలాక్స్‌గా ఉంటారు కానీ మేల్కొని ఉంటారు. శ్వాసను అనుభవిస్తారు. పడుకున్నప్పుడు శరీరంలోని వివిధ భాగాలలో జలదరింపు అనుభూతి చెందుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa