ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టారిఫ్‌ల బెదిరింపులపై.. అమెరికాకు జిన్‌పింగ్ చురకలు

international |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 08:59 PM

అమెరికా సుంకాల బెదిరింపులపై షాంఘై కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) వేదిక నుంచి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పరోక్షంగా చురకలంటించారు. రెండో ప్రపంచ యుద్ధ చరిత్రపై సరైన దృక్పథాన్ని ప్రోత్సహించి, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వ్యతిరేకించాలని, ఘర్షణ, బెదిరింపులను నిరోధించాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో చైనా, భారత్ సహా ఇతర దేశాలపై ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికాకు గట్టి సందేశం పంపినట్టయ్యింది. షాంఘై సహకార సంస్థ  సభ్య దేశాలు సమానమైన, క్రమబద్ధమైన బహుళ ధ్రువ ప్రపంచం, సమ్మిళిత ఆర్థిక ప్రపంచీకరణ కోసం వాదనలు వినిపించాలని ఆయన పేర్కొన్నారు.


‘‘మనం సమానత్వం, న్యాయాన్ని కాపాడాలి.. రెండో ప్రపంచ యుద్ధ చరిత్రపై సరైన దృక్పథాన్ని ప్రోత్సహించి.. ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వం, ఘర్ణణ; బెదిరింపులను నిరోధించాలి.. ఐక్యరాజ్యసమితి కేంద్రంగా అంతర్జాతీయ వ్యవస్థను కాపాడాలి, అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు మద్దతు ఇవ్వాలి.. సమానత్వం, క్రమబద్ధతతో కూడిన బహుళ ధ్రువ ప్రపంచాన్ని ప్రోత్సహించాలి.. అంతే కాకుండా సమగ్ర ఆర్థిక ప్రపంచీకరణకు.. న్యాయమైన, సమంజసమైన అంతర్జాతీయ పాలనా వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలి’’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారు.


‘‘ఆచరణాత్మకత, సామర్థ్యానికి కట్టుబడి ఉండాలి.. షాంఘై కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్‌ సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లాలి.. వనరులు వినియోగం, సామర్ధ్య నిర్మాణాన్ని పెంచి, వ్యవస్థలు మరింత బలంగా ఉండేలా చూడాలి.. శాస్త్రీయంగా నిర్ణయాలు, సమర్ధవంతంగా చర్యలు ఉండాలి.. భద్రతా ముప్పులు, సవాళ్లను ఎదుర్కొడానికి సమగ్ర కేంద్రం, డ్రగ్స్ నియంత్రణ కేంద్రాన్ని వేగంగా ఏర్పాటుచేయాలి.. అలాగే, సభ్య దేశాల రక్షణ, ఆర్థిక సహకారానికి మరింత బలమైన మద్దతు అందించడానికి ఎస్‌సీఓ అభివృద్ధి బ్యాంకును వీలైనంత త్వరగా ప్రారంభించాలి’’ అని జిన్‌పింగ్ కోరారు.


‘‘విభేదాలను పక్కనబెట్టి ఉమ్మడి వేదికను ఏర్పాటుచేసుకోవాలి.. విశాల దృక్పథం, తెలివిగా వ్యవహరించి ఉమ్మడి వేదికపై ఆకాంక్షలను పంచుకోవడం బలం, ప్రయోజనకరం... ఎస్‌సీఓలోని అన్ని సభ్య దేశాలు స్నేహితులు, భాగస్వాములు. మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి.. వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ను కొనసాగించి, సామూహిక ఏకాభిప్రాయాన్ని నిర్మించాలి.. ఐక్యత, సహకారాన్ని బలోపేతం చేసి, సహకారాన్ని విస్తరించాలి, శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సును ప్రోత్సహించే ఉమ్మడి బాధ్యతను అందరూ భరించాలి’’ అని సభ్యదేశాలకు చైనా అధ్యక్షుడు పిలుపునిచ్చారు.


‘‘పరస్పర విశ్వాసం, పరస్పర లాభం, సమానత్వం, సంప్రదింపులు, విభిన్న నాగరికతలకు గౌరవం, సాధారణ అభివృద్ధి సాధన అనే 'షాంఘై స్పిరిట్‌' నినాదంతో షాంఘై సహకార సంస్థను 24 ఏళ్ల కిందట ఏర్పాటు చేశాం... గత 24 ఏళ్లుగా సభ్య దేశాలు ఈ ప్రాథమిక సంకల్పాన్ని కాపాడుతూ అవకాశాలను పంచుకొని, సాధారణ అభివృద్ధి కోసం కృషి చేసి, ఎస్సీఓ అభివృద్ధి, సహకారాన్ని ముందుకు నడిపి, పలు విప్లవాత్మక, చారిత్రాత్మక విజయాలను సాధించాయి’’ అని జిన్‌పింగ్ అన్నారు. ఎస్‌సీఓను 2001 జూన్ 15న ఏర్పాటుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa