దివ్యాంగులు పరీక్షలు, పోటీ పరీక్షలు రాయడానికి ఇబ్బంది పడకుండా.. వారికి సహాయకులను తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. వీరినే స్క్రైబ్ అంటారు. అయితే కొన్ని రకాల పరీక్షలకు యాజమాన్యాలే స్క్రైబ్‌లను అలాట్ చేస్తే.. కొన్నింటికి దివ్యాంగులే సొంతంగా స్క్రైబ్‌లను తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే సొంతంగా స్క్రైబ్‌లను తీసుకుని వెళ్లడం వల్ల పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షలు రాసే దివ్యాంగుల స్క్రైబ్‌ల విషయంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. ఆ వివరాలు..
పోటీ పరీక్షల్లో దివ్యాంగులకు సాయం చేసే స్క్రైబ్‌ల విషయంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. పరీక్షా సమయంలో అవకతవకలను అరికట్టేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులే సొంతంగా స్క్రైబ్‌లను తెచ్చుకునే విధానానికి ముగింపు పలకాలని.. దశలవారీగా దీనికి స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది. అంతేకాక దేశంలో పలు పోటీ పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎస్‌ఎస్‌సీ వంటి సంస్థలు.. వారే స్వయంగా నిష్ణాతులైన స్క్రైబ్‌లను తయారు చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
ఇకపై నిర్వహించే పోటీ పరీక్షల్లో ఆయా సంస్థలు సిద్ధం చేసిన స్క్రైబ్‌లనే దివ్యాంగులకు సహాయకులుగా కేటాయించాలని పేర్కొంది. రానున్న రెండేళ్లలో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సొంత స్క్రైబ్‌లకు అనుమతి ఇవ్వాలని తెలిపింది.
అలానే స్క్రైబ్‌గా తీసుకునే అభ్యర్థి వయసు.. పరీక్ష రాసే అభ్యర్థి కన్నా 2, 3 విద్యాసంవత్సరాలు తక్కువగా ఉండాలని.. అలాంటి వారినే స్క్రైబ్‌లుగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. అలానే పరీక్ష రాసే అభ్యర్థి, స్క్రైబ్ ఒకే పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉండకూడదని తెలిపింది. దీనికి సంబంధించి తాజాగా సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరగకుండా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సవరించిన ఈ నియమాలు అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలతో పాటుగా సాంకేతి విద్యా ప్రవేశాలు, ప్రొఫెషనల్ ఎగ్జామ్స్‌కు కూడా వర్తిస్తాయని వివరించింది. అలానే దివ్యాంగ అభ్యర్థులు స్క్రైబ్‌ల మీద ఆధారపడకుండా.. వారి కోసం సాఫ్ట్‌వేర్ ఎనెబుల్డ్ ల్యాప్‌టాప్‌లు, బ్రెయిలీ, రికార్డింగ్ పరికరాలు, పెద్ద ప్రింట్‌లు వంటి ఇతర టెక్నికల్ సాధనాలు వినియోగించకుని.. సొంతంగా పరీక్షలు రాసేలా వారిని ప్రోత్సాహించాలని తెలిపింది. ఈ విధానాల వల్ల వారు రేపు ఆఫీసుల్లో విధులు నిర్వర్తించే సమయంలో స్వతంత్రంగా వారి పనులు వారు చేసుకునే అవకాశం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa