భారీ ఎదురు దెబ్బలు తిన్న మావోయిస్టులు కొత్త మలుపు తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్లు, నేతల మరణాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్ధత ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15వ తేదీన ఒక సంచలన ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
ప్రతినిధి అభయ్ ప్రకటనలో, మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ఇకపై ఆయుధ మార్గాన్ని కాకుండా ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగుతామని ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చలకు తాము పూర్తిగా సిద్ధమని, సమస్యల పరిష్కారానికి సంభాషణే మార్గమని అభయ్ పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. మే 21వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గుండెకోట్ దగ్గర జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ సహా 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇది మావోయిస్టులకు పెద్ద షాక్‌గా మారింది.
ఈ దాడుల తర్వాత మావోయిస్టుల శక్తి మరింత తగ్గిపోయినట్లు సమాచారం. నేతల మృతి, క్యాడర్ కొరత, భద్రతా దళాల ఆపరేషన్లతో కోలుకునే స్థితిలో లేని పరిస్థితుల్లో, చర్చల మార్గాన్ని ఎంచుకోవడం మావోయిస్టులకు తప్పని స్థితిగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటనతో ఆందోళనలుగా ఉన్న ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణకు మార్గం సుగమమవుతుందనే ఆశలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa