M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్ తాజాగా విడుదల కాగా.. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాను వెలుగులోకి వచ్చింది. ఎప్పటిలాగే ముకేష్ అంబానీ కుటుంబమే టాప్‌లో నిలవగా.. 31 ఏళ్ల వయసు కల్గిన ఓ యువ భారతీయుడు కూడా అపరకుబేరుడిగా నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచారు. ముఖ్యంగా చెన్నైకి చెందిన అరవింద్ శ్రీనివాస్.. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో తనదైన ముద్ర వేసి M3M Hurun India Rich List 2025లో దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా స్థానం సంపాదించారు. పర్‌ప్లెక్సిటీ (Perplexity) అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన శ్రీనివాస్.. నికర సంపద అంచనా విలువ సుమారు రూ. 21,190 కోట్లు
1994 జూన్ 7న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన శ్రీనివాస్‌కు చిన్నప్పటి నుంచే సైన్స్‌పై తీవ్ర ఆసక్తి ఉండేది. ఐఐటీ మద్రాస్‌లో చదువుతున్నప్పుడే.. ఆయన రెయిన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, అడ్వాన్స్‌డ్ రెయిన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌పై కోర్సులను కూడా బోధించారు. ఆ తర్వాత ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. కంప్యూటర్ విజన్‌కు సంబంధించిన కాంట్రాస్టివ్ లెర్నింగ్, రెయిన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, ఇమేజ్ జనరేషన్, ఇమేజ్ రికగ్నిషన్, వీడియో జనరేషన్ కోసం ట్రాన్స్‌ఫార్మర్-ఆధారిత నమూనాలతో కూడిన విస్తృత పరిశోధన చేశారు.
ఆ తర్వాత శ్రీనివాస్ ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ దిగ్గజాలలో పనిచేసి గణనీయమైన అనుభవాన్ని సంపాదించారు. మొదట్లో ఆయన ఓపెన్ ఏఐ సంస్థలో రెయిన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌పై పని చేశారు. తరువాత లండన్‌లోని డీప్‌మైండ్‌లో కాంట్రాస్టివ్ లెర్నింగ్‌పై దృష్టి సారించారు. ఆ తర్వాత గూగుల్‌లో కొంతకాలం పని చేసి, హలోనెట్ (HaloNet), రెస్‌నెట్-ఆర్‌ఎస్ (ResNet-RS) వంటి విజన్ మోడళ్లను అభివృద్ధి చేశారు. అనంతరం ఆయన తిరిగి ఓపెన్‌ఏఐకి రీసెర్చ్ సైంటిస్ట్‌గా వచ్చి.. టెక్స్ట్-టు-ఇమేజ్ జనరేషన్ మోడల్ అయిన DALL-E 2 అభివృద్ధికి దోహదపడ్డారు.
2022 ఆగస్టులో అరవింద్ శ్రీనివాస్.. డెనిస్ యారాట్స్, ఆండీ కొవిన్స్కితో కలిసి పర్‌ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI)ని స్థాపించారు. ఈ సంస్థ ఏఐ-ఆధారిత చాట్-సెర్చ్ ఇంజిన్ GPT-3 వంటి నమూనాలను ఉపయోగించి.. వినియోగదారుల ప్రశ్నలకు వేగవంతమైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన సమాధానాలను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. 2023 జనవరి నుంచి శ్రీనివాస్, ఎలెవన్‌ల్యాబ్స్ (ElevenLabs) (టెక్స్ట్-టు-స్పీచ్ ప్లాట్‌ఫారమ్, సూనో (Suno) (టెక్స్ట్-టు-మ్యూజిక్ టూల్స్) వంటి ఆశాజనకమైన ఏఐ స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా పెట్టుబడులు పెడుతున్నారు.
పర్‌ప్లెక్సిటీ ఏఐకి సంబంధించిన వినియోగదారుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పోల్చితే.. భారత దేశంలోనే అత్యధికంగా పెరిగింది. దీంతో శ్రీనివాస్ భారతదేశాన్ని తమ కంపెనీ వృద్ధి వ్యూహంలో ముఖ్యమైన కేంద్రంగా గుర్తించారు. ఈ ఆదరణ కారణంగా ఆయన ఉత్పత్తి అభివృద్ధికి మించి వ్యూహాత్మక పెట్టుబడుల కోసం పర్‌ప్లెక్సిటీ ఫండ్‌ను ఏర్పాటు చేయడంతో సహా మరిన్ని కార్యక్రమాలను అన్వేషిస్తున్నారు. అంతేకాకుండా ఆయన బెంగుళూరు లేదా హైదరాబాద్‌లో ఏఐ ఇంజనీరింగ్ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ప్రయాణం, షాపింగ్, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో భాగస్వామ్యాల కోసం కూడా ఆయన ఆసక్తి చూపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa