ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువత, మహిళల అకాంక్షలను అర్ధం చేసుకోవాలన్న పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 05, 2025, 07:51 AM

ప్రజాప్రతినిధులుగా మనమందరం యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన, రహదారుల నిర్మాణం, అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటికి అవసరమైన ప్రాజెక్టుల సాధన, నిధుల సమీకరణపై ప్రతి శాసన సభ్యుడు అధ్యయనం చేసి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న జనసేన పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాలన, రాజకీయపరమైన అంశాలపై పవన్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకొని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని సూచించారు. జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ఈ క్రమంలో వారితోపాటు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, తద్వారా ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు సంక్షేమం ఏ విధంగా చేరుతుంది, అక్కడి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఏ విధంగా కల్పించాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం లాంటి విషయాలపై దృష్టి సారించాలని తెలిపారు. అదే సందర్భంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కల్పిస్తున్న రహదారుల కల్పన, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలని, కూటమి ప్రభుత్వం ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలన్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన, రహదారుల అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం శాసన సభాపక్షం నుంచే ఒక్కో అంశంపై ఒక్కో కమిటీ వేసుకొందామన్నారు. ఆరు వారాల్లోగా ఆయా కమిటీలు నివేదికలు అందించాలని తెలిపారు.జనసేన పార్టీకి మిలీనియల్స్ బలంగా నిలిచారు. అదే క్రమంలో వారి ఆకాంక్షలు గ్రహించాలన్నారు. వారితోపాటు ‘జెన్ జీ’ తరంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, చర్చిస్తూ ఉండాలని సూచించారు. ఈ తరం వారి రాజకీయ, సామాజిక ఆలోచనలు అర్థం అవుతాయని, వారు తీసుకొస్తున్న ఆవిష్కరణలు తెలుస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌ను ఎలా నిర్మించి, ఎన్ని వందల కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టిందీ కూడా నవ తరానికి స్పష్టంగా తెలుసునని అన్నారు. మనం కచ్చితంగా రుషికొండ ప్యాలెస్‌ను సద్వినియోగపరచడంపై బలంగా దృష్టిపెట్టాలన్నారు. నిర్ధిష్ట కాల వ్యవధిలో రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావడం చాలా అవసరమన్నారు. ఆ దిశగా ప్రభుత్వానికి మన పార్టీ తరఫున ఆలోచనలు తెలియచేయాలని సూచించారు. జెన్ జి తరం అభివృద్ధికి, వారి ఉపాధి ఉద్యోగావకాశాలకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.నియోజకవర్గాలలో ఉన్న ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యేలు కూలంకషంగా పరిశీలన చేయాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాటిని చర్చించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అదే విధంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అనుసరించిన ఉత్తమ విధానాలు, విజయ గాథలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియచేయాలని, వాటిని సభ ముందుకు తీసుకువెళ్దామన్నారు. నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో జనవాణి కార్యక్రమాన్ని చేపట్టే దిశగా చర్యలు మొదలుపెట్టాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు, వారి బాధలు మరింతగా తెలుస్తాయన్నారు.కూటమి పార్టీలపరంగా నియోజకవర్గాల్లో మూడు పార్టీల సమన్వయ సమావేశాలు ప్రతి నెలా నిర్వహించాలన్నారు. ఆ సమావేశాల్లో కూటమి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకొనేలా ముందుకు వెళ్ళాలని, ఈ క్రమంలో సమష్టిగా ఆలోచనలు చేసి, ఒక్కటిగా గళం వినిపించాలన్నారు. కూటమిని బలపరుస్తూనే మన పార్టీని బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని, ఇందుకోసం మన పార్టీ తరఫున త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే తెలియచేస్తానన్నారు. వాటిని ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యతల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. సార్వత్రిక ఎన్నికల్లో మనకు బలం ఉన్న నియోజకవర్గాల్లోనూ పొత్తు ధర్మం ప్రకారం పోటీకి దూరంగా ఉన్నామని, అక్కడి మన కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒక్కొక్కరికి అప్పగిస్తున్న అయిదు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, పార్టీ శ్రేణులతో మమేకం కావాలని, స్థానిక ఎన్నికల్లో యువతకు, కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa