ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై తాలిబన్ మంత్రి వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:31 PM

లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు దీర్ఘకాలంగా అఫ్గనిస్థాన్ భూభాగాన్ని తమ కార్యకలాపాలకు అడ్డగా చేసుకున్నాయి. కానీ, గత నాలుగేళ్లలో అన్ని ఉగ్రవాద సంస్థలను తమ భూభాగం నుంచి తరిమికొట్టామని భారత పర్యటనలో ఉన్న తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ వెల్లడించారు. శాంతి విషయంలో పాకిస్తాన్ కూడా తమ మార్గాన్నే అనుసరించాలని ముత్తఖీ సూచించారు. ‘వాళ్లలో ఒక్కడు కూడా అఫ్గనిస్థాన్‌లో లేడు. వారి నియంత్రణలో ఒక్క అంగుళం భూమి కూడా లేదు. మేము (2021లో) ఆపరేషన్ నిర్వహించిన అఫ్గన్ ఇప్పుడు మారిపోయింది’ అని ముత్తఖీ వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు కూడా బలమైన సందేశం పంపిన తాలిబన్ మంత్రి.. శాంతి కోసం అఫ్గనిస్థాన్ మాదిరిగా ఉగ్రవాద సమూహాలపై ఇతర దేశాలు కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అఫ్గన్‌లో రెండోసారి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వారి మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. దీంతో నాలుగేళ్ల తర్వాత భారత్, అఫ్గన్ మధ్య మళ్లీ దౌత్య కార్యకలాపాలు పునరుద్దరణకు ముందడుగు పడింది. కాబూల్‌లోని టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.


ఇక, తమ పొరుగు దేశ ప్రగతిపట్ల ‘లోతైన ఆసక్తి’ఉందని పేర్కొంటూ... ఇటీవల కాబూల్‌లో జరిగిన పేలుడు ఘటనపై వచ్చిన నివేదికలను ప్రస్తావించి, ఆ దాడికి పాకిస్థాన్‌నే బాధ్యుడిగా ఆరోపించారు. ‘సరిహద్దు సమీపంలోని దూరప్రాంతాల్లో దాడి జరిగింది. ఈ చర్యను మేము పాకిస్థాన్ వైఖరి తప్పు అని భావిస్తున్నాం.. సమస్యలు ఇలాంటి మార్గంలో పరిష్కరించలేరు.. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం... వారు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలి.. 40 ఏళ్ల తర్వాత అఫ్గన్‌లో శాంతి, అభివృద్ధి నెలకొంది. దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. అఫ్గన్ ఇప్పుడు స్వతంత్ర దేశం. మాకు శాంతి లభిస్తే, దాంతో ఎందుకు కొందరికి అసౌకర్యంగా ఉంది?’ అని ఆయన ప్రశ్నించారు.


ఇదే సమయంల అఫ్గన్ ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. ‘ఒకవేళ ఎవరికైనా అఫ్గన్‌కు ఆటంకాలు కలిగించాలనే ఉద్దేశం ఉంటే పోయి సోవియట్ యూనియన్, అమెరికా, నాటోలను అడగండి.. అఫ్గన్‌తో గేమ్స్ ఆడొద్దని వాళ్లు వివరిస్తారు’ అని తాలిబన్ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. పాక్‌తో మేము మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని, కానీ, అది ఒకవైపు నుంచి మాత్రమే కాదని స్పష్టం చేశారు.


భారత్‌తో అఫ్గనిస్థాన్ సంబంధాలు గురించి ప్రస్తావిస్తూ.. ఇటీవల సంభవించిన భూకంపం సమయంలో మొదట భారత్ స్పందించిందని తెలిపారు. ‘‘భారత్‌ను అఫ్గన్ అత్యంత సన్నిహిత మిత్రుడిగా భావిస్తుంది.. పరస్పర గౌరవం, వాణిజ్య, ప్రజల మధ్య సంబంధాల ఆధారంగా అఫ్గన్ సంబంధాలు కోరుకుంటోంది.. మన సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడేల పరస్పర అవగాహన కోసం ఓ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని అమిర్ ఖాన్ ముత్తఖీ అన్నారు. అలాగే, ట్రంప్ సుంకాలను ఆయన కూడా ప్రస్తావించారు. ఇదే సమయంలో భారత్, అఫ్గన్ మధ్య పరస్పర సహాకారం అవసరమని నొక్కిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa