ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వీసా అభ్యర్థనను తిరస్కరించిన అఫ్గన్

international |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 11:09 PM

భారత్ పొరుగు దేశాలైన అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఈమధ్య కాలంలో తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం పాకిస్తాన్.. కాబూల్ సహా అఫ్గన్ భూభాగంపై వైమానిక దాడులకు దిగింది. దీంతో అఫ్గన్ పాలకవర్గమైన తాలిబన్ ప్రతీకార చర్యలకు పాల్పడింది. ఫలితంగా ఇరు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని నివేదికలు వెల్లడించాయి.పా క్ ప్రకటించిన దాని ప్రకారం.. 200 మందికి పైగా తాలిబాన్, ఇతర మిలిటెంట్లు చనిపోయారు. వీరితో పాటు 23 మంది పాక్ సైనికులు చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు.


ఇక అఫ్గనిస్థాన్ తెలిపిన దాని ప్రకారం.. మొత్తం 58 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయి. ఈక్రమంలో ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి వీసా అభ్యర్థనను కాబూల్ తిరస్కరించింది. ఆ వివరాలు..


తాజాగా పాక్ రక్షణ మంత్రితో పాటు ఐఎస్ఐ చీఫ్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. కాబూల్‌లో పర్యటించే అధికారిక పర్యటన కోసం వీసా మంజూరు చేయాల్సిందిగా.. అఫ్గనిస్థాన్‌ను పదే పదే విన్నవించుకున్నప్పటికీ.. ఆ దేశం తిరస్కరించింది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. గత మూడు రోజులుగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్‌తో పాటు.. ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్ అలానే మరో ఇద్దరు పాక్ జనరల్స్ చేసిన 3 వేర్వేరు వీసా అభ్యర్థనలను అఫ్గనిస్తాన్ తిరస్కరించింది. ఏకంగా పాక్ రక్షణ శాఖ మంత్రి వీసా అభ్యర్థనను తిరస్కరించడం అంటే దాయాది దేశానికి మామూలు అవమానం కాదు.


దీని గురించి కాబూల్‌ ఐఈఏ(ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్థాన్) ఒక ప్రకటన చేసింది. పాక్ ఇటీవల గగనతల ఉల్లంఘనలకు పాల్పడమే కాక.. పాక్టిక ప్రావిన్స్‌లో వైమానిక దాడులకు పాల్పడింది. ఈ కారణంగానే వారి వీసా అభ్యర్థనలను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఈ నలుగురు సభ్యులు వీసా అభ్యర్థనలు సమర్పించగా... కాబూల్ వాటిని నిరాకరించింది. తమ పౌరుల మీద దాడులు చేసిన తర్వాత.. ఏ ప్రతినిధి బృందం కూడా తమ దేశానికి వస్తుందని ఆశించలేమని అని కాబూల్ అధికారులు తెలిపారు.


పాక్ విషయంలో అఫ్గనిస్థాన్ తీసుకున్న నిర్ణయం కేవలం దౌత్యపరమైన అవమానం మాత్రమే కాక.. కాబూల్.. తన నిబంధనలపై దాయాది దేశం పాకిస్థాన్ ‌తో చర్చలు జరపదనే స్పష్టమైన సందేశాన్ని పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. పాకిస్థాన్.. అఫ్గన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందుకు గాను.. ఆదేశం మీద ప్రతీకారం తీర్చుకోవాలనేది కాబూల్ ఉద్దేశం అని ఈ నిర్ణయం చెప్పకనే చెబుతుందని అంటున్నారు. పాక్ అభ్యర్థనను కాబూల్ తిరస్కరించడం అంటే.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో రోజు రోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa