ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో,,,పట్టపగలే మ్యూజియంలో ఘరానా దోపిడీ

international |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 08:00 PM

మోసాలిసా వంటి ప్రపంచ ప్రసిద్ధి కళాఖండాలు, పురాతన సంపదలకు నిలయమైన పారిస్‌లోని లూవ్ర్ మ్యూజియంలో ఘరానా దోపిడీ జరిగింది. నెపోలియన్ కాలానికి చెందిన ఆభరణాలను మ్యూజియం నుంచి ఎత్తుకెళ్లారు. హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో మ్యూజియంలోకి ప్రవేశించిన దొంగలు.. అమూల్యమైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యూనెజ్ తెలిపారు. ఈ ఘటనను అతిపెద్ద దోపిడీగా ఆయన అభివర్ణించారు. స్థానిక కాలమానం ప్రకారం.. అక్టోబరు 19న ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ దోపిడీ జరిగింది. సెయిన్ నది వైపున నిర్మాణంలో ఉన్న ప్రదేశం నుంచి హైడ్రాలిక్ నిచ్చేన సాయంతో అపోలో గ్యాలరీలోకి ప్రవేశించినట్టు ప్రెంచ్ పత్రికి లే పారిసియన్ తెలిపింది. అక్కడ ఫ్రెంచ్ రాజ కుటుంబానికి చెందిన ఆభరణాల ప్రదర్శన జరుగుతోందని, వాటిని ఎత్తుకెళ్లారని పేర్కొంది. వీటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా.


డిస్క్ కట్టర్ సాయంతో కిటికీ ఊచలను కత్తిరించి లోపలికి ప్రవేశించినట్టు న్యూనెజ్ చెప్పారు. కేవలం ఏడు నిమిషాల్లో ఈ దోపిడీ ముగించి, నగలను దోచుకెళ్లిపోయారని అన్నారు. నెపోలియన్, ఆమె భార్య ఆభరణాలలో మొత్తం తొమ్మిది విలువైనవి ఎత్తుకెళ్లారని, వాటిలో ఒకటి మాత్రం తర్వాత మ్యూజియం వెలుపల దొరికిందని ఫ్రాన్స్ మీడియా పేర్కొంది. ఈ ఘటనపై లూవ్ర్ మ్యూజియం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అత్యవసర కారణాలతోనే ఆకస్మికంగా మ్యూజియం మూసివేసినట్టు తెలిపింది.


ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అలాగే, కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిర్వాహకులు మ్యూజియంను తాత్కాలికంగా మూసివేసి దర్యాప్తుకు సహకరిస్తున్నారు. దోపిడీ గురించి తొలుత ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి రచిడా దాతి అధికారిక ప్రకటన చేశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.


మీడియాలో ప్రసారమవుతోన్న దృశ్యాలలో లూవ్ర్ మ్యూజియం వెలుపల బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు, గేట్లు తెరుచుకుంటాయనే ఆశతో వేచి ఉన్న జనసందోహం కనిపించింది. దోపిడీ అనంతరం మ్యూజియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. అధికారులు లూవ్ర్ సమీపంలో భద్రతా బలగాలను మోహరించి, ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. ఈ ఘటనతో ఫ్రాన్స్ సాంస్కృతిక రంగం, భద్రతా వ్యవస్థలపై మళ్లీ దృష్టి కేంద్రీకృతమైంది.


లువ్ర్ ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శకులు వచ్చే మ్యూజియం. ఇక్కడ రోజుకు 30 వేల మంది వస్తారు. ఇందులో మొత్తం 33 వేలకుపైగా ప్రపంచ ప్రఖ్యాత కళాఖండాలు, పురాతన వస్తువులు ఉన్నాయి. దీంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ప్రపంచప్రసిద్ధ పెయింటింగ్ ‘మోనా లీసా’, దీంతో పాటు ‘వీనస్ డి మిలో’ శిల్పం, అలాగే ‘వింగ్‌డ్ విక్టరీ ఆఫ్ సామోథ్రేస్’ వంటి అద్భుత కళా సంపదలు ఉన్నాయి.


అయితే, గతంలో కూడా ఈ మ్యూజియంలో దోపిడీలు, దోపిడీ యత్నాలు జరిగాయి. అందులో అత్యంత ప్రసిద్ధమైంది 1911 నాటి మోనా లీసా పెయింటింగ్ చోరీ. చిత్రకారుడు లియోనార్డో డావిన్చీ కుంచె నుంచి జాలువారినీ ఈ చిత్రాన్ని మ్యూజియంలో పనిచేసిన మాజీ సిబ్బంది వించెన్జో పెరూజియా దొంగిలించాడు. అతను దానిని తన కోటు కింద దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లాడు. ఈ విలువైన చిత్రాన్ని రెండేళ్ల తర్వాత ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరిసారిగా 1983లో దోపిడీ రెనైసాన్స్ యుగానికి చెందిన రెండు విలువైన యోధ కవచాలు (ఆర్మర్‌లు) అదృశ్యమయ్యాయి.. దశాబ్దాల పాటు దశాబ్దాలపాటు కనిపించకుండాపోయిన వీటిని చివరికి2021లో అవి తిరిగి పోలీసులచే స్వాధీనం చేసుకోవడం గమనార్హం.ప్రస్తుత దోపిడీతో లూవ్ర్ మ్యూజియం భద్రతా వ్యవస్థపై మళ్లీ అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa