బిహార్ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయం కోసం తహతహలాడుతున్నారు. ఇక నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యం పెట్టుకున్న ఇండియా కూటమి .. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు సీట్ల పంపకాల్లో గొడవలు జరుగుతున్నా.. తమ కూటమి తరఫున ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించగా.. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వెనుకబడిన వర్గానికి చెందిన యువ నాయకుడు, వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (వీఐపీ) వ్యవస్థాపకుడు ముకేష్ సహనీగా అవకాశం కల్పించింది.
సినిమా సెట్ డిజైనర్ స్థాయి నుంచి రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన ముకేష్ సహనీ.. తన నిషాద్ సామాజిక వర్గం ఓట్లను కూటమి వైపు తిప్పుకునే గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నారా అనే చర్చ ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో మొదలైంది. సాధారణ మత్స్యకారుల కుటుంబం నుంచి బాలీవుడ్ సెట్ డిజైనర్ స్థాయికి.. ఆ తర్వాత బిహార్ రాజకీయాల్లో కీలక నేతగా ముకేష్ సహనీ ప్రయాణం కొనసాగింది.
1981లో ముకేష్ సహనీ దర్భంగాలో మత్స్యకారుల కుటుంబంలో పుట్టారు. 8వ తరగతి వరకే చదువుకున్న ముకేష్ సహనీ.. కేవలం 19 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లి సేల్స్‌మ్యాన్‌గా పనిచేశారు. కొంతకాలానికి టీవీ, సినీ పరిశ్రమలో సెట్ డిజైనర్‌గా అడుగుపెట్టారు. ముఖేష్ సినీవరల్డ్ అనే చిన్న కంపెనీని పెట్టి.. షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్ (2002), సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ (2015) వంటి పెద్ద సినిమాలకు పనిచేశారు. దీంతో ఆ సినిమా బంధాలు ఆయనను దర్భంగాలో ప్రముఖుడిగా మార్చాయి.
2010లో సాహనీ సమాజ్ కల్యాణ్ సంస్థను స్థాపించిన ముకేష్ సహనీ.. తన సామాజిక వర్గానికి సేవ చేయడం ద్వారా రాజకీయాల వైపు అడుగులు వేశారు. మల్లా కుమారుడిగా గుర్తింపు పొందిన ముకేష్ సహనీ.. తన సామాజిక వర్గం నిషాద్ (పడవలు నడిపే, జాలర్లు) కోసం పోరాటం ప్రారంభించారు. ముకేష్ సహనీకి రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఓటు బ్యాంక్‌పై గట్టి పట్టు ఉంది. నిషాద్ వర్గాన్ని ఏకం చేయడంలో ఆయన విజయం సాధించారు. బిహార్‌లోని మొత్తం ఓటర్లలో 30 శాతం కంటే ఎక్కువ మంది అత్యంత వెనుకబడిన తరగతులు (ఈబీసీలు) ఉన్నారు.
ఈ వర్గంలో నిషాద్‌లకు బలమైన ప్రాతినిధ్యం ఉంది. 2023 బిహార్ కుల సర్వే ప్రకారం.. నిషాద్ వర్గం రాష్ట్ర జనాభాలో 9.6 శాతం కాగా.. ముఖేష్ సహనీకి చెందిన మల్లా ఉప కులం 2.6 శాతంగా ఉంది. బిహార్ సంప్రదాయంగా నిషాద్ వర్గం ఒకే పార్టీకి కట్టుబడి ఉండరు. బిహార్‌లోని ముజఫర్‌పూర్, దర్భంగా, ఖగారియా వంటి ఉత్తర బిహార్ జిల్లాల్లో ఎన్నికల ఫలితాలను మార్చగలిగే ఫ్లోటింగ్ ఓటర్లుగా వీరిని భావిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ముఖేష్ సహానీ ప్రచారం చేశారు. అయితే తమ వర్గానికి ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్‌ను బీజేపీ నెరవేర్చకపోవడంతో ఆ పార్టీకి దూరం జరిగి.. వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (వీఐపీ)ని స్థాపించారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసి 4 సీట్లలో విజయం సాధించారు.
ఎన్నికల్లో ఓడినప్పటికీ.. బీజేపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయిన ముఖేష్ సహానీ.. బిహార్ పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి అయ్యారు. 2022లో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం, ఇతర అంతర్గత విభేదాల కారణంగా 2022 మార్చి 27వ తేదీన ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించిన తర్వాత ముఖేష్ సహానీ 2022లోనే మహాగఠ్‌బంధన్ (ఇండియా కూటమి)లో చేరారు.
ప్రస్తుత 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేష్ సహనీ వ్యక్తిగతంగా పోటీ చేయకపోయినా.. ఆయనను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఇండియా కూటమికి బలమైన వ్యూహం ఉంది. నిషాద్ వర్గానికి చెందిన నాయకుడికి ఇంతటి కీలక పదవిని ఇవ్వడం ద్వారా.. గతంలో ఎన్డీఏకు మద్దతు పలికిన ఈ 9.6 శాతం నిషాద్ వర్గం ఓటర్లను తమవైపు పూర్తిగా తిప్పుకోవాలని ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
అయితే ఇందుకోసం ఇండియా కూటమి ముందు ముఖేష్ సహనీ పలు డిమాండ్లు పెట్టారు. తన నిషాద్ వర్గానికి ఎస్సీ హోదా కల్పించడంతోపాటు.. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, వృద్ధులకు నెలకు రూ.1,500 సామాజిక భద్రతా పెన్షన్ వంటి హామీలను ఇస్తున్నారు. అయితే ముకేష్ సహనీకి సొంత పార్టీలోనే చీలికగా ఏర్పడింది. విశ్వకర్మ వికాస్ ఇన్సాన్ పార్టీ (వీవీఐపీ) రూపంలో ప్రత్యర్థి కూడా ఉంది. వీవీఐపీ పార్టీ నిషాద్ ఓట్లను చీల్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సెట్ డిజైనర్ నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఎదిగిన ముకేష్ సహనీ.. బిహార్ ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa