ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీజేఐపై దాడికి యత్నించిన లాయర్‌కు ఊరట.. కోర్టు ధిక్కార చర్యలకు నో చెప్పిన సుప్రీం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 07:09 PM

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఇటీవలే ఓ న్యాయవాది షూ విసిరేందుకు ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించగా.. సదరు లాయర్ సుప్రీం కోర్టు ఆవరణలో కూడా అడుగు పెట్టడానికి అనుమతి లేదని బార్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఆయనకు భారీ ఊరటను ఇచ్చింది. ముఖ్యంగా సీజేఐపైకి షూ విసిరిన న్యాయవాది రాకేశ్ కిశోర్‌పై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.


ఈ విషయంపై సీజేఐ జస్టిస్‌ గవాయ్ వ్యక్తిగతంగా ఎటువంటి కేసు నమోదు చేయలేదని.. ఆ న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆయన విముఖత చూపారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాదిపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. కోర్టు హాలులో నినాదాలు చేయడం, బూట్లు విసిరేయడం వంటివి స్పష్టమైన కోర్టు ధిక్కారానికి సంబంధించిన నేరాలే అయినప్పటికీ.. వీటిపై చట్టపరంగా ముందుకెళ్లాలా వద్దా అనే నిర్ణయం సంబంధిత న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


"కోర్టు ధిక్కారానికి సంబంధించిన నోటీసులు జారీ చేయడం వలన సీజేఐపై దాడికి యత్నించిన ఆ న్యాయవాదికి అనవసరమైన ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుంది" అని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే ఈ విషయంలో తమకు చట్టపరమైన చర్యలు ప్రారంభించడానికి ఆసక్తి లేదని స్పష్టం చేసింది. అయితే భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. అటువంటి నివారణా చర్యలను తప్పకుండా పరిశీలిస్తామని న్యాయస్థానం హామీ ఇచ్చింది.


న్యాయవాది కిశోర్ ఇటీవల ఒక కేసు విచారణ జరుగుతున్న సమయంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై తన కాలి బూటును విసిరి దాడికి యత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ బూటును అడ్డుకుని.. న్యాయవాదిని కోర్టు హాలు నుంచి బయటకు తరలించారు. ఈ సమయంలో లాయర్ కిశోర్ ‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై సీజేఐ అప్పుడే స్పందిస్తూ.. "ఇలాంటి బెదిరింపులు నా విధి నిర్వహణను ఏ మాత్రం ప్రభావితం చేయలేవు" అని ధైర్యంగా ప్రకటించారు. ఈ సంఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలు, న్యాయవాదుల సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.


ఈ సంఘటన అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వెంటనే స్పందించింది. ఆ న్యాయవాది సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ఆయన ప్రవేశించకుండా నిరోధించడానికి ఎంట్రీ కార్డును శాశ్వతంగా రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa