ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కించే ప్రయత్నం,,,జాప్యంపై కారణాలు వివరిస్తూ అన్ని జోన్లకు లేఖలు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 08:14 PM

దేశంలో నడుస్తోన్న సెమీ-హైస్పీడ్ రైళ్లు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఛైర్‌కార్‌‌ మాత్రమే ఉండగా.. స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబరు నాటికి పట్టాలెక్కిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. కానీ, కేంద్రం చెప్పిన సమయం అయిపోయి నవంబరు నెల కూడా రానే వచ్చింది. కానీ, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో జాప్యంపై రైల్వే శాఖ సోమవారం కీలక ప్రకటన చేసింది.


వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభించడంలో జాప్యానికి గల కారణాలను వివరిస్తూ డైరెక్టర్ జనరల్ (డీజీ), ది రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ అర్గనైజేషన్‌ సహా అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు అక్టోబరు 28 లేఖలు రాసింది. డిజైన్లలో సంక్లిష్టతతోపాటు ఇతర కారణాల వల్ల స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం ఆలస్యమైందని అందులో పేర్కొంది. అంతేకాదు, చాలాచోట్ల ఫర్నిషింగ్, పనితనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది.


అలాగే, బెర్తింగ్ ఏరియాలో వాడిగా ఉండే అంచులు, కమర్స్, విండో కర్టెన్ హ్యాండిల్స్, బెర్త్‌ల మధ్య పాకెట్స్ శుభ్రపరిచడం తదితర సమస్యలే వందే భారత్ రైళ్లు జాప్యానికి గల కారణాలని సోదాహరణంగా వివరించింది. అయితే, కొత్తగా రూపకల్పన చేసిన ఈ రైళ్లకు ఆర్డీఎస్‌ఓ, సీసీఆర్ఎస్ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన అనంతరం రైళ్లను ప్రారంభించడానికి అనుమతి కోరుతూ కేంద్రానికి చీఫ్ కమిషనర్ రైల్వే సేఫ్టీ (సీసీఆర్ఎస్) లేఖ రాస్తారు. దీని ఆధారంగా వందేభారత్ రైళ్లు పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ అనుమతిస్తుంది.


‘ట్రయల్ సమయంలో తన పరిశీలనలను సమ్మతి కోసం RDSOకి సీసీఆర్ఎస్ నివేదిస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు విషయంలో సెప్టెంబర్ 1న ఆర్డీఎస్వో చివరిసారిగా సమ్మతిని తెలియజేసింది’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు ఏ రూట్లో ముందు అందుబాటులోకి వస్తుందో ఇంకా ఖరారు కాలేదని, అందుకే అక్టోబర్ 28న అన్ని జోన్లకు రైల్వే శాఖ లేఖను పంపిందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాద నివారణ చర్యలు, కవచ్‌ 4.0 వ్యవస్థ, లోకో పైలట్‌, రైలు మేనేజర్‌, సమీప స్టేషన్ మాస్టర్‌ల మధ్య నమ్మకమైన సమాచార వ్యవస్థ ఏర్పాటు, అన్ని రకాల బ్రేక్ సిస్టమ్‌ల సక్రమ నిర్వహణ వంటి ముఖ్యమైన అంశాలను అందులో ప్రస్తావించినట్టు పేర్కొన్నారు.


వందేభారత్ స్లీపర్ రైలు కోచ్‌లలో అధునాతన సౌకర్యాలను, ఆధునిక ఇంటీరియర్‌లను ఏర్పాటు చేశారు. భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ఆటోమేటిక్ ఇంటర్ కోచ్‌ డోర్లు, వైఫై, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టులు, సెన్సార్ ఆధారిత లైటింగ్‌, డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెళ్లను అమర్చారు. ప్రమాదాలను నిరోధించేందుకు రక్షణ వ్యవస్థ కవచ్‌ ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa