ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకప్పుడు కలిసి పనిచేసినవారు ఎందుకు విడిపోయారు,,,,నితీష్-లాలూ బ్రేకప్‌ స్టోరీ

national |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 08:19 PM

బిహార్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా నిలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ , నితీష్ కుమార్ ప్రయాణం 1975 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ప్రారంభమైంది. వీరి ప్రయాణం ఒకే వేదికపై ప్రారంభమైనప్పటికీ.. వారి రాజకీయ అడుగులు, వ్యక్తిత్వాలు, పరిపాలనలో తీసుకునే నిర్ణయాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేవి. జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో భాగంగా జనతా పార్టీ సిద్ధాంతాలు వారిని బాగా ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే 1977 ఎన్నికల్లో వీరిద్దరూ రాజకీయ అరంగేట్రం చేశారు.


ఒక చరిష్మాటిక్ వక్తగా లాలూ ప్రసాద్ యాదవ్.. తనదైన గ్రామీణ శైలి, హాస్యం, స్టేజీ ప్రదర్శనలతో బిహార్ ప్రజలను తొందరగా ఆకట్టుకునే వ్యక్తిగా మారారు. ఈ క్రమంలోనే 1977 ఎన్నికల్లోనే ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తెరవెనుక కార్యకర్తగా పనిచేసిన నితీష్ కుమార్.. రాజకీయ వ్యూహాలు, ప్రకటనలు రూపొందించడంతోపాటు.. పొత్తులను కుదుర్చడంలో నిమగ్నమయ్యేవారు. ఇక నితీష్ కుమార్.. తాను పోటీ చేసిన మొదటి 2 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. రాజకీయాల్లోకి వచ్చిన 5 ఏళ్ల తర్వాత తొలిసారి విజయాన్ని అందుకున్న నితీష్ కుమార్.. పనిచేసే కార్యకర్త అనే పేరును సంపాదించుకున్నారు.


ఇక 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రి కావడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే.. లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పాలనకు సంబంధించిన సలహాలను నితీష్ కుమార్ పదే పదే ఇవ్వడం ఆయనకు అంతగా నచ్చలేదు. ప్రముఖ జర్నలిస్ట్ శంకర్షన్ ఠాకూర్ రాసిన 'బ్రదర్స్ బిహారీ' పుస్తకంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక సందర్భంలో నితీష్ కుమార్ సలహా ఇస్తుండగా లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 'నువ్వు నాకు పరిపాలన నేర్పిస్తావా? పాలన నుంచి అధికారం రాదు, ఓటు బ్యాంకు నుంచే వస్తుంది' అని నితీష్‌ కుమార్‌పై లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఆ ఘటన తర్వాతి నుంచే వారిద్దరి మధ్య విభేదాలు పెరగడం ప్రారంభమైనట్లు సమాచారం.


లాలూ-నితీష్ బిహార్ భవన్ గొడవ


1992లో ఢిల్లీలోని బీహార్ భవన్‌లో జరిగిన సంఘటన లాలూ-నితీష్ విడిపోవడానికి ఒక కీలక మైలురాయిగా మారింది. ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సూట్‌కు నితీష్ కుమార్, అతని అనుచరులు లాలన్ సింగ్‌ సహా ఇతరులు వెళ్లగా.. ఆయన తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు. ' వారిని బయటకు నెట్టేయండి, ఈడ్చుకుపోండి' అని సెక్యూరిటీ సిబ్బందిపై లాలూ తీవ్రంగా అరిచారు.


దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నితీష్ కుమార్.. అక్కడి నుంచి బయటికి వస్తూ.. ఇక ఇద్దరం కలిసి నడవడం కష్టమని వ్యాఖ్యానించారు. లాలూ-నితీష్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు.. అప్పటి జనతా దళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఆ ఘటనకు క్షమాపణ చెప్పడానికి లాలూ ప్రసాద్ యాదవ్ ఒప్పుకున్నా.. నితీష్ కుమార్ మాత్రం అందుకు ససేమిరా అన్నారు.


కుర్మీ చేతన ర్యాలీ


1994 నాటికి.. లాలూ యాదవ్ ప్రభుత్వం యాదవ వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందనే భావన బిహార్‌లో పెరిగింది. దీనిపై నితీష్ కుమార్‌కు చెందిన కోయిరీ, కుర్మీ వర్గాలు తీవ్ర అసంతృప్తి చెందాయి. ఈ అసంతృప్తిని వెళ్లగక్కుతూ 1994 ఫిబ్రవరిలో బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో కుర్మీ చేతన ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో నితీష్ కుమార్ పాల్గొంటే అది తాను ద్రోహంగానే భావిస్తానని లాలూ తీవ్ర హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ.. వెనక్కి తగ్గని నితీష్ కుమార్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వేదిక పైకి ఎక్కారు.


'మాకు భిక్షం కాదు, సరైన వాటా కావాలి, మా ప్రయోజనాలను విస్మరించే ప్రభుత్వం అధికారంలో ఉండలేదు' అని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. ఇక అప్పుడు నితీష్ కుమార్ ఇచ్చిన నినాదమే కొత్త పార్టీని స్థాపించడానికి.. లాలూతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి దారితీసిన యుద్ధ ప్రకటనగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. దీంతో లాలూతో విడిపోయిన నితీష్‌.. జనతాదళ్ యునైటెడ్ పార్టీని స్థాపించారు. అప్పటివరకు మిత్రులుగా ఉన్న లాలూ-నితీష్.. ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రత్యర్థులుగా మారడం ప్రారంభమైంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa