ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్రకులాల నియంత్రణలో భారత సైన్యం.. రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 07:28 PM

బిహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రం అవుతోంది. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను దుమారాన్ని రేపాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


దేశ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఉన్న (అగ్రవర్ణాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ) దేశంలోని కార్పొరేట్ రంగం, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలను పొందుతున్నారని పేర్కొన్నారు. భారత సైన్యం కూడా ఆ 10 శాతం మంది నియంత్రణలోనే ఉందని తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో మిగిలిన 90 శాతం మంది ప్రజలు.. అంటే వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), దళితులు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర మైనారిటీలు వ్యవస్థలో ఎక్కడా కనిపించడం లేదని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.


అయితే గత ఏడాది నుంచి ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్న జాతీయ కుల జనగణన గురించి మాట్లాడుతూ.. ఆ గణాంకాలు తమకు అవసరమని, అవి లేకపోతే రాజ్యాంగాన్ని పరిరక్షించడం సాధ్యం కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎంతమంది దళితులు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలు ఉన్నారో తమకు సమాచారం కావాలని రాహుల్ డిమాండ్ చేశారు. 90 శాతం మందికి భాగస్వామ్య హక్కులు లేకపోతే రాజ్యాంగాన్ని రక్షించలేమని తెలిపారు. అయితే.. చాలా రోజులుగా సామాజిక న్యాయ పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ.. భారత సైన్యాన్ని ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


అయితే ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో సైన్యాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మందలించిన సంఘటనలు ఉన్నాయి. 2022 డిసెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్-చైనా సైనిక ఘర్షణ జరిగిన తర్వాత.. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో భాగంగా.. చైనా సైనికులు భారత సైనికులను కొడుతున్నారని వ్యాఖ్యానించారు.


ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీహ్ తీవ్రంగా తప్పుపట్టారు. 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనా ఆక్రమించిందని ఎలా తెలిసిందని ప్రశ్నించారు. నిజమైన భారతీయులైతే ఇవన్నీ మాట్లాడరని జస్టిస్ దీపంకర్ దత్తా రాహుల్‌ గాంధీని తీవ్రంగా మందలించారు. ఇక గత మే నెలలో.. భారత ఆర్మీని అవమానించే హక్కు వాక్ స్వాతంత్య్రంలో భాగం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.


గతంలో సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ భారతదేశాన్ని బలహీనపరిచి.. చైనాను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బదులిస్తూ.. నిజమైన భారతీయులు ఎవరో న్యాయస్థానాలు నిర్ణయించలేవని వ్యాఖ్యానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa