బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కూటమి.. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దల భారీ ప్రచారంతో.. బిహార్ ఓటర్లను తమవైపు తిప్పుకున్నారు. గత 20 ఏళ్లుగా బిహార్ సీఎంగా కొనసాగుతున్న నితీష్ కుమార్.. ప్రజావ్యతిరేకతను దాటుకుని మరీ విజయాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యారు. ఈ 20 ఏళ్లలో ఆయన ఎన్ని కూటములు మారినా.. ప్రభుత్వాలను మధ్యలో కూల్చేసి.. తిరిగి సీఎంగా ఎన్నికైనా.. ఆయనకు ఉన్న ఛరిష్మా అలాగే కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు.. ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర వహించారు.
అయితే మహిళల ఓట్లను ఆకర్షించడంలో నితీష్ కుమార్ సర్కార్ విజయం సాధించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. నితీష్ కుమార్ ప్రభుత్వం ఒక కీలక పథకాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పేరుతో అర్హత ఉన్న మహిళలకు రూ.10 వేల చొప్పున అందించడం.. ఆయన గెలుపులో కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గతేడాది జరిగిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అనుసరించిన ఈ ప్లాన్.. ఇప్పుడు బిహార్‌లోనూ గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని పేర్కొంటున్నారు. దీనికితోడు నితీష్ కుమార్‌కు మహిళల్లో భారీగా ఫాలోయింగ్ ఉండటం కూడా కలిసొచ్చింది. ఇక ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద బిహార్‌లో సుమారు 75 లక్షల మంది మహిళల అకౌంట్లలో రూ.10 వేల చొప్పున నితీష్ కుమార్ సర్కార్ జమ చేసింది. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు తాత్కాలిక సాయంగా ఈ రూ.10 వేలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఈ డబ్బుతో మహిళలు స్వయం ఉపాధి సాధిస్తే.. రూ.2 లక్షల వరకు లోన్లు ఇస్తామని నితీష్ కుమార్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగేందుకు ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. బిహార్‌లో మొత్తం 66.91 ఓటింగ్ శాతం నమోదు కాగా అందులో మహిళలే అధికంగా ఉండటం విశేషం. ఈ ఎన్నికల్లో 71.6 శాతం మహిళలు ఓటు వేశారు. అయితే బిహార్ మహిళలను తమ వైపు తిప్పుకునేందుకు తాము గెలిస్తే ఒక్కొక్కరికీ రూ.30 వేలు ఇస్తామని తేజస్వీ యాదవ్ కూడా ప్రకటించినప్పటికీ.. బిహార్ మహిళలు దాన్ని పట్టించుకోలేదు.
అయితే ఈ మహిళలకు ఆర్థిక సాయం ఫార్ములా గతంలో మధ్యప్రదేశ్‌లో ఫుల్ సక్సెస్ అయింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అప్పటి శివరాజ్‌సింగ్ ప్రభుత్వంపై ఎన్నికలకు ముందు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. లాడ్లీ బహన్ యోజన పేరుతో.. పేద మహిళల ఖాతాల్లో నెలకు రూ.1250 చొప్పున జమ చేశారు. ఇదే ఆ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర వహించిందని తెలిపారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేయడానికి ఉఫయోగపడింది.
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మహారాష్ట్రలో షాక్ అయింది. మహారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాలకు గానూ 30 స్థానాల్లో ఇండియా కూటమి గెలవగా.. ఎన్డీఏ కూటమి కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. దీంతో అలర్ట్ అయిన ఎన్డీఏ.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు లడ్కీ బహిన్ యోజన పేరుతో మహిళల ఖాతాల్లో రూ.1500 వేసింది. ఈ పథకమే మహారాష్ట్రలో తిరిగి ఎన్డీఏ కూటమి విజయం సాధించేందుకు దోహదపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa