భారత క్రికెట్ జట్టు టెస్టు ప్రదర్శనపై మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవం, అంతకుముందు న్యూజిలాండ్ చేతిలో ఓటమి కేవలం మామూలు ఫలితాలు మాత్రమే కావని, జట్టులో అంతర్లీనంగా ఉన్న లోతైన సమస్యలకు అద్దం పడుతున్నాయని విశ్లేషించాడు. టెస్టు క్రికెట్‌కు సరిపోయే దృక్పథాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జట్టులో సమూల మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 140 పరుగులకే ఆలౌట్ అయి, దక్షిణాఫ్రికా చేతిలో 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పరుగుల పరంగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమి. అంతేకాకుండా, స్వదేశంలో ఆడిన చివరి ఏడు టెస్టుల్లో భారత్‌కు ఇది ఐదో పరాజయం. ఈ విజయంతో సౌతాఫ్రికా సుదీర్ఘకాలం తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచింది.ఈ ఫలితాలపై జియోస్టార్‌తో మాట్లాడుతూ కుంబ్లే తన విశ్లేషణను పంచుకున్నాడు. "సౌతాఫ్రికాతో ఓటమి, న్యూజిలాండ్‌తో 3-0 తేడాతో ఓడిపోవడం వంటివి కేవలం ఫలితాలకే పరిమితం కాదు. ఇవి జట్టులోని విస్తృత సమస్యలను సూచిస్తున్నాయి. భారత జట్టు కొన్ని సందర్భాల్లో మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపించినా, చివరికి చేతులెత్తేసింది. టెస్టు క్రికెట్‌కు భిన్నమైన ఆలోచనా విధానం అవసరం. తరచూ తుది జట్టులో మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్‌లో సర్దుబాట్లు, ఆటగాళ్ల రొటేషన్ వంటివి జట్టులో నిలకడ లేకుండా చేస్తున్నాయి. గాయాలు, ఫామ్ లేమి సహజమే అయినా, ఈ ఓటమిపై భారత్ లోతుగా సమీక్షించుకోవాలి" అని అన్నాడు.భారత జట్టు తదుపరి టెస్టు సిరీస్‌ను 2026 ఆగస్టులో శ్రీలంకతో ఆడనుంది. ఈ సుదీర్ఘ విరామాన్ని ఓటమిపై సమీక్ష జరిపి, జట్టును పునర్నిర్మించడానికి ఒక అవకాశంగా వాడుకోవాలని కుంబ్లే సూచించాడు. ఇటీవలి కాలంలో పలువురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అవ్వడంతో జట్టులో ఒకరకమైన శూన్యత ఏర్పడింది. దానిని భర్తీ చేయడానికి స్పష్టమైన దృష్టి, ప్రణాళిక అవసరం. యువ ప్రతిభను ప్రోత్సహించడానికి, వారికి మార్గనిర్దేశం చేయడానికి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన ఒక బలమైన కోర్ టీమ్ ఉండాలి. సరైన పునాది లేకుండా ఒకేసారి ఎక్కువ మంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం సరైన పద్ధతి కాదు అని కుంబ్లే వివరించాడు.భారత బ్యాటింగ్ వైఫల్యాలపై కుంబ్లే తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. రవీంద్ర జడేజా (54) మినహా మరే ఇతర బ్యాటర్ కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటకపోవడాన్ని ప్రస్తావించాడు. నాలుగు ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ భాగస్వామ్యం వల్ల గరిష్టంగా 83.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. చివరి ఇన్నింగ్స్‌లో అయితే పూర్తిగా చేతులెత్తేశారు. సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు, పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. కానీ, విజయం సాధించాలంటే పోరాటం, పరిస్థితులకు అనుగుణంగా మారడం, పట్టుదల అవసరం. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని, చొరవ తీసుకుని, పాజిటివ్‌గా ఆడిన జడేజాలో ఆ లక్షణాలు కనిపించాయి. దురదృష్టవశాత్తు, ఈ వైఫల్యం వేర్వేరు బౌలర్లు, జట్లు, పరిస్థితుల్లో పునరావృతమవుతోంది. పిచ్‌పై సహజమైన మార్పులను ఎదుర్కోవడంలో భారత్ విఫలమైంది అని కుంబ్లే ముగించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa