సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్ చేసే కుట్రలను ముందే పసిగట్టి మన భద్రతా దళాలు దీటుగా స్పందిస్తుంటాయి. అలాంటి ఓ భారీ కుట్రను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భగ్నం చేసి, కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 22న పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిచేసి, 26 మంది అమాయకుల ప్రాణాలు తీశారు. ఈ దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో దాయాదికి బుద్ధి చెప్పింది. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకొచ్చింది.
కాగా, మే 7న భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన కొద్ది గంటల అనంతరం జమ్మూ కశ్మీర్ సరిహద్దు సమీపంలోని ఉరి జలవిద్యుత్ ప్రాజెక్టుల పై దాడులకు పాకిస్థాన్ ప్రయత్నించింది. కానీ, ఈ ప్రయత్నాన్ని సీఐఎస్ఎఫ్ బలగాలు నిర్వర్యం చేశాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ ప్రాజెక్టులకు ఎటువంటి ముప్పు రాకుండా సురక్షితంగా ఉంచడమే కాదు.. 250 మంది ప్రాణాలను కాపాడాయి. సీఐఎస్ఎఫ్‌కు చెందిన 19 మంది జవాన్లు ధైర్యసాహసాలను ప్రదర్శించి దాయాది కుట్రలను తిప్పికొట్టారు. తాజాగా వారికి ‘DGs disc’ను ప్రదానం చేయడంతో పాక్ పన్నాగం వెలుగులోకి వచ్చినట్టు జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. పెండెంట్ ఆకారంలో ఉండే ‘డీజీస్ డిస్క్’ మెడల్‌ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ అందజేస్తారు.
మీడియా నివేదికల ప్రకారం ‘‘పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ రాడార్లను ఏమార్చి దాయాది సైన్యం ఏం జరిగిందో తెలుసుకునేలోపు 25 నిమిషాల్లో ఆపరేషన్‌ను పూర్తిచేసి భారత్ సైన్యం వెనక్కి వచ్చేసింది. ఈ పరిణామాలతో భిత్తరపోయిన పాకిస్థాన్.. సరిహద్దుల్లోని భారత భూభాగాల వైపు విచక్షణారహితంగా మోర్టార్లు, షెల్లింగ్ దాడులకు తెగబడింది. దాంతో ఉరి హైడ్రో పవర్ ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి. వాటికి సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
దీంతో నియంత్రణ రేఖకు కొద్ది దూరంలో ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది ఈ ఆకస్మిక దాడులతో అప్రమత్తమయ్యారు. పాకిస్థాన్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. కమాండెంట్ రవి యాదవ్ నేతృత్వంలోని సీఐఎస్ఎఫ్ బృందం పవర్ ప్రాజెక్ట్‌లతో పాటు ప్రజలకు ఏ ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసింది. కాల్పులు కొనసాగుతుండగానే ఇంటింటికి వెళ్లి స్థానికులు, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) సిబ్బంది కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.. వారి అప్రమత్తతతో ప్రజల ప్రాణాలతో పాటు జాతీయ ఆస్తులు చెక్కుచెదరలేదు’’అని అధికార వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టడంలో మన నిఘా వ్యవస్థ సామర్థ్యం, సైన్యం అప్రమత్తత కీలక పాత్ర పోషించాయని వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1.8 లక్షల మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లోని అత్యంత ముఖ్యమైన పరిశ్రమలు, ప్రాజెక్ట్‌లతో పాటు విమానాశ్రయాలు, అణు, అంతరిక్ష ప్రయోగ కేంద్రాల వద్ద భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa