ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిలిగురి కారిడార్‌పై సద్గురు జగ్గీ వాసుదేవ్ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 08:08 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ చికెన్స్ నెక్ ( సిలిగురి కారిడార్ ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య భారతదేశాన్ని మిగిలిన దేశంతో అనుసంధానించే అత్యంత కీలకమైన చికెన్స్ నెక్ కారిడార్‌ భౌగోళిక బలహీనతను సరిదిద్దాలని పిలుపునిచ్చారు. 1947 భారత్, పాక్ విభజన సమయంలో ఏర్పాటైన ఈ సిలిగురి కారిడార్.. ఒక చారిత్రక పొరపాటుగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ విమోచనం కోసం జరిగిన 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఈ సిలిగురి కారిడార్‌ను విస్తరించే అవకాశం భారత్‌కు ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోలేకపోయామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులు, మైనారిటీలు మరీ ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో.. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలగకుండా ఈ చికెన్స్ నెక్‌ను ఏనుగు అంత బలశాలిగా మార్చాల్సిన అవసరం ఉందని సద్గురు జగ్గీ వాసుదేవ్ నొక్కి చెప్పారు. దేశ భద్రత, ప్రాంతీయ సమగ్రత కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడకూడదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.


'గంభీర్ ముందు నువ్వు రంజీ టీమ్‌కి కోచ్‌గా చెయ్.. ఆ తర్వాతే టెస్టుకు ఫిట్ అవుతావు '.. ఇంగ్లండ్ మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు


కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ చికెన్స్ నెక్‌ అనేది గత 78 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక అసహజమైన స్థితి అని సద్గురు అభివర్ణించారు. ప్రస్తుతం భారతదేశ సార్వభౌమాధికారానికి బహిరంగంగా ముప్పులు ఎదురవుతున్నాయని సద్గురు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ బలహీనమైన కోడి మెడ (చికెన్స్ నెక్) లాంటి మార్గాన్ని ఇకపై అలాగే వదిలేయకూడదని పేర్కొన్నారు. దాన్ని తగిన విధంగా పోషించి ఏనుగు లాగా (బలమైన, విశాలమైన మార్గంగా) మార్చాల్సిన సమయం ఆసన్నమైందని జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చారు.


ఏ దేశమైనా తన ప్రాంతీయ సమగ్రతను కాపాడుకోవడానికి బలహీనమైన పునాదులపై ఆధారపడకూడదని.. అవసరమైతే ఈ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సద్గురు సూచించారు. దేశ భద్రత కోసం చేసే పనులకు ఎప్పుడూ కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై.. మరీ ముఖ్యంగా హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి సద్గురు గతంలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాల విధ్వంసం, హిందువులపై హింస వంటి సంఘటనలు కేవలం ఆ దేశ అంతర్గత విషయాలు కావని.. అవి మానవత్వానికి సంబంధించిన అంశాలని సద్గురు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల జనాభా శాతం దశాబ్దాలుగా గణనీయంగా తగ్గుతూ వస్తోందని.. వారి రక్షణ కోసం భారత్ గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


సరిహద్దులు లేని ప్రపంచం అనేది ఒక ఉన్నతమైన ఆశయమని పేర్కొన్న జగ్గీ వాసుదేవ్.. కానీ ప్రస్తుతం ప్రపంచం ఉన్న స్థితిలో అది ఆచరణాత్మకం కాదని అభిప్రాయపడ్డారు. రేపే అందరూ కలిసిపోతారని ఊహించుకోవడం అమాయకత్వం అవుతుందని.. ప్రస్తుతం దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని గుర్తు చేశారు. ఎలాగైతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్‌గా మారాయో.. భవిష్యత్తులో మన ప్రాంతంలో కూడా అలాంటి మార్పు సాధ్యం కావొచ్చని అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం దేశ సరిహద్దుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa