ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం జరగడం లేదని.. ఉన్నావో దోషి సెంగార్ కుమార్తె సంచలన లేఖ

national |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 08:06 PM

ఉన్నావో అత్యాచార దోషి, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌‌కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్‌పై సుప్రీంకోర్టు డిసెంబరు 29న (సోమవారం) స్టే విధించిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ను సుప్రీంకోర్టు సవాల్ చేయగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై సెంగార్ కుమార్తె స్పందిస్తూ.. భారత న్యాయవ్యవస్థపై తమకున్న నమ్మకం సన్నగిల్లుతోందని, ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నా న్యాయం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సెంగార్ కుమార్తె డాక్టర్ ఇషిత సెంగార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బహిరంగ లేఖ రాశారు. కాగా, అత్యాచార బాధిత యువతి సెంగార్‌కు ఉరిశిక్ష పడే వరకూ పోరాడుతామని శపథం చేసింది.


‘‘న్యాయవ్యవస్థపై మాకున్న నమ్మకం సన్నగిల్లుతోంది.. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నా న్యాయం దక్కడం లేదు.. మా తండ్రి ఒక బీజేపీ ఎమ్మెల్యే కావడంతో మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు.. మానవత్వాన్ని, మాట్లాడే హక్కును కూడా కాలరాస్తున్నారు.. సోషల్ మీడియాలో నన్ను రేప్ చేయాలని, చంపాలని బెదిరిస్తున్నారు.. ఈ ద్వేషం తనను మానసికంగా కుంగదీస్తోంది’’ అని ఆమె కన్నీటిపర్యంతమైంది.


‘‘మేము మౌనంగా ఉండటానికి కారణం వ్యవస్థపై నమ్మకమే.. నిరసనలు, ఆందోళనలు చేయలేదని, నిజం బయటపడటానికి ఆర్భాటం అవసరం లేదని భావించాం.. కానీ ఈ మౌనం తమను ఎంతగానో దెబ్బతీసింది.. తమ గౌరవాన్ని, మానసిక స్థైర్యాన్ని, ఆర్థిక స్థోమతను దెబ్బతీసింది.. ఎన్నో తలుపులు తట్టాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం.. అయినా తమ మాట ఎవరూ వినలేదు.. మా వాదనలో బలం లేకనో, ఆధారాలు లేకనో కాదు.. మా నిజం కొందరికి ఇబ్బందికరంగా మారింది.. మమ్మల్ని బలవంతులని అని పిలుస్తున్నారు.. కానీ ఎనిమిదేళ్లుగా గొంతులేని వారిగా మార్చినదేంటి?’ ఇషిత ప్రశ్నించారు.


రోజురోజుకీ తమ పేరును మట్టిలో కలిపేస్తున్నా, వ్యవస్థ తమ ఉనికిని కూడా గుర్తించనప్పుడు, తమకున్నదేంటి అని ఆమె నిలదీశారు. ‘మేము భయపడుతున్నది అన్యాయం గురించే కాదు.. కావాలనే సృష్టించిన భయం గురించి.. ఈ భయం న్యాయమూర్తులను, జర్నలిస్టులను, సంస్థలను, సామాన్య ప్రజలను కూడా మౌనంగా ఉండేలా ఒత్తిడి చేస్తోంది.. నిజం ఇంత సులభంగా అణచివేయబడితే తనలాంటి వారు ఎక్కడికి వెళ్లాలి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


‘‘ఈ లేఖ ద్వారా ఎవరినీ బెదిరించడం లేదు.. సానుభూతి కోరడం లేదు.. నేను భయంతో రాస్తున్నాను.., అయినా ఎవరో ఒకరు తమ మాట విని పట్టించుకుంటారని ఆశిస్తున్నాను.. మేము ఎలాంటి ప్రత్యేకత కోరడం లేదు.. కేవలం మానవులుగా న్యాయం కోరుతున్నాం.. దయచేసి చట్టం భయం లేకుండా మాట్లాడనివ్వండి. దయచేసి ఆధారాలను ఒత్తిడి లేకుండా పరిశీలించనివ్వండి. దయచేసి నిజం, అది ప్రజాదరణ పొందకపోయినా, నిజంగానే పరిగణించనివ్వండి.. నేను ఈ దేశాన్ని నమ్ముకున్న కుమార్తెను.. నా నమ్మకాన్ని వమ్ము చేయవద్దు’’ ఆమె విజ్ఞప్తి చేశారు.


సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత సెంగార్ మరో కుమార్తె, ఆయన లీగల్ టీమ్‌లో సభ్యురాలైన ఐశ్వర్య సెంగార్ మాట్లాడుతూ.. మెరిట్స్‌పై తమ ముందస్తు వాదనలను వినిపించడానికి డిఫెన్స్ అనుమతించలేదని అన్నారు. ‘ఆమె తన స్టేట్‌మెంట్‌ను చాలాసార్లు మార్చింది, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, చివరికి రాత్రి 8 గంటల వరకు మూడుసార్లు సమయం మార్చింది కాబట్టి, ఈ రోజు కేసు యోగ్యతపై మేము వాదించలేకపోయాం.. ఆమె వయస్సు 18 ఏళ్లు పైబడినట్లు ఎయిమ్స్ మెడికల్ బోర్డు తేల్చింది. నేను సంఘటన జరిగిన ప్రదేశంలో లేనని సీడీఆర్ రికార్డులు చూపిస్తున్నాయి. సంఘటన జరిగినట్లు చెబుతున్న సమయంలో ఆమె స్వయంగా ఫోన్‌లో ఉన్నట్లు కూడా రికార్డులో ఉంది’ అని ఆమె అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa