వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 2013 నుంచి 2016 మధ్య కాలంలో సుమారు 5.20 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.43,000 కోట్ల పైచిలుకు) విలువైన బంగారాన్ని వెనిజులా నుంచి స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
మదురో అధికారంలోకి వచ్చాకే మొదలు..
నికోలస్ మదురో 2013లో వెనిజులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక పరిస్థితి గందరగోళంలో పడింది. ఆ మూడేళ్ల కాలంలోనే దాదాపు 113 మెట్రిక్ టన్నుల స్వచ్ఛమైన బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించారు. వెనిజులా సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న నిల్వల నుంచే ఈ బంగారం తరలిపోయినట్లు స్విస్ బ్రాడ్‌కాస్టర్ 'ఎస్‌ఆర్‌ఎఫ్' ధ్రువీకరించింది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, నగదు లభ్యత కోసం ప్రభుత్వం ఈ బంగారాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే గోల్డ్ రిఫైనింగ్‌కు స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రం కావడంతో.. అక్కడ శుద్ధి చేయడం, ధ్రువీకరణ పొందడం కోసం ఈ బంగారాన్ని పంపినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
యూరోపియన్ యూనియన్ (EU) వెనిజులాపై ఆంక్షలు విధించిన 2017 సంవత్సరం నుంచి ఈ ఎగుమతులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతో వెనిజులాకు చెందిన కీలక వ్యక్తులపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. స్విట్జర్లాండ్ కూడా 2018 ఆరంభంలో ఈ ఆంక్షలను స్వీకరించింది. వెనిజులా సెంట్రల్ బ్యాంక్ వద్ద నిల్వలు నిండుకోవడం వల్ల కూడా ఎగుమతులు ఆగిపోయి ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకురాలు రోనా ఓ కానెల్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల జనవరి 3న కరాకస్‌లో జరిగిన ఆకస్మిక దాడిలో అమెరికా ప్రత్యేక దళాలు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ కోర్టులో డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో-టెర్రరిజం వంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదురోతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన మరో 36 మందికి సంబంధించిన ఆస్తులను స్విస్ బ్యాంకులు స్తంభింపజేశాయి. అయితే వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి తరలిన బంగారానికి, ప్రస్తుతం ఫ్రీజ్ చేసిన ఆస్తులకు మధ్య ఉన్న సంబంధంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
వెనిజులా ప్రజలు తీవ్ర ఆకలితో, ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సమయంలోనే ఇంత భారీ సంపద దేశం దాటడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ బంగారం ఆసియా మార్కెట్లలో విక్రయించబడిందా లేక ఆర్థిక సంస్థల వద్దే ఉండిపోయిందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa