వైఎస్ఆర్సీపీ పార్టీ వారు వరెన్ని కుట్రలు పన్నినా ప్రజా రాజధాని అమరావతి అన్‌స్టాపబుల్ అని, దానిని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొందరు అసూయతో కలలు కంటున్నారని, అది ఎప్పటికీ జరగని పని అని ఉద్ఘాటించారు. నీరు ఉన్నచోటే నాగరికత అభివృద్ధి చెందుతుందన్న ప్రాథమిక అవగాహన లేనివారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. శనివారం నాడు విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అమరావతికి తీసుకొచ్చి, దానిని మేటి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.విజయవాడను 'విద్యలవాడ'గా మార్చడంలో సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థలు కీలక భూమిక పోషించాయని చంద్రబాబు ప్రశంసించారు. ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకోవడం ఒక చరిత్రాత్మక ఘట్టమని, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించి లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు. తాను గతంలో సిద్ధార్థ అకాడమీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు, ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరుకావడం సంతోషంగా ఉందని గుర్తుచేసుకున్నారు. అగ్రిటెక్ కళాశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. 1975లో కొందరు ప్రముఖులు ప్రారంభించిన ఈ సంస్థ, నేడు 28 వేల మంది విద్యార్థులు, 4 వేల మంది సిబ్బందితో మహావృక్షంగా ఎదిగిందని కొనియాడారు.కొందరి అసూయకు హద్దు లేకుండా పోతోందని, గత ప్రభుత్వ హయాంలో అమరావతిని ఆపేందుకు చేసిన కుట్రలను ప్రజలు చూశారని చంద్రబాబు అన్నారు. అయినా వారికి బుద్ధి రాలేదని విమర్శించారు. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని కడుతున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఢిల్లీ, చెన్నై, రాజమండ్రి వంటి నగరాలన్నీ నదీ తీరాల్లోనే ఉన్నాయన్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. అమరావతిని పవిత్ర జలాలు, మట్టితో పునీతం చేశామని, భవిష్యత్తులో విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిసి అద్భుత నివాస ప్రాంతంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఆరు నెలల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ వస్తుందని, రెండేళ్లలో ఇక్కడి నుంచే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లను సరఫరా చేస్తామని వెల్లడించారు.కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, ఐదు కిలోమీటర్లకు ఉన్నత పాఠశాల, ప్రతి మండలంలో జూనియర్ కళాశాల, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజినీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఎన్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు, తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. విశాఖకు గూగుల్ వస్తోందని, ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని తెలిపారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, కర్నూలు జిల్లా ఓర్వకల్లు డ్రోన్ హబ్‌గా మారబోతోందని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకెళుతున్నామని, ఆరోగ్య రంగాన్ని కృత్రిమ మేధ (AI)తో అనుసంధానించి మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని, అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa