కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఒక మహిళ తీవ్ర అత్యాచార ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తే, మహిళల భద్రతకు బాధ్యత వహించాల్సిన హోమ్ మంత్రి మాత్రం ఇప్పటివరకు స్పందించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించినా, ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా మహిళా హోమ్ మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గమని ఆమె అభివర్ణించారు. “మహిళ అయి ఉండి కూడా బాధిత మహిళకు న్యాయం చేయాలన్న కనీస స్పందన లేకపోవడం అత్యంత బాధాకరం. ఇది మహిళల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి పరాకాష్ట,” అని ఆమె అన్నారు.ఎన్నికల సమయంలో మహిళల భద్రతపై పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ నేతలపై ఆరోపణలు వస్తే చట్టాన్ని పక్కన పెట్టడం సిగ్గుచేటన్నారు. “ఇదే ఆరోపణ వైయస్ఆర్సీపీకి చెందిన ఎవరిపైనైనా వచ్చి ఉంటే ఇప్పటివరకు అరెస్టులు, మీడియా ట్రయల్స్, సోషల్ మీడియా దాడులు జరిగేవి. కానీ జనసేన ఎమ్మెల్యే విషయంలో మాత్రం చట్టం అంధుడిగా మారిపోయిందా?” అని ఆమె ప్రశ్నించారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం నోరు మెదపకపోవడం నేరస్తులకు రక్షణ కల్పించినట్లేనని ద్రాక్షాయణి స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం కూటమిని కాపాడాలనే ఆలోచనతో బాధితురాలి వేదనను అణచివేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె విమర్శించారు. హోమ్ శాఖ పూర్తిగా విఫలమైందని, శాంతిభద్రతలు గాడి తప్పాయని ఆమె ఆరోపించారు. “రాష్ట్రంలో మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. దాడులు, వేధింపులు, అత్యాచారాలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలకు ఎవరు భద్రత కల్పిస్తారు?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa