ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలలోనూ....మరింత కఠినంగా టీటీడీ రూల్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 06:14 PM

తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలలోనూ ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. స్వర్ణ దేవాలయం తరహా చట్టాన్ని తిరుమలలోనూ తీసుకొచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారి మీద క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో పలువురు మంత్రులు.. సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు వారితో ఈ విషయాలపై చర్చించినట్లు సమాచారం. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం చట్టాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. టీటీడీ నిబంధనలు మరింత కఠినంగా మార్చాలని.. అలాగే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్తుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.


అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం నిర్వహణ పంజాబ్ సిక్కు గురుద్వారా చట్టం, 1925 ప్రకారం నిర్వహిస్తారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ చారిత్రక సిక్కు మందిరాల నిర్వహణ కోసం దీనిని ఏర్పాటు చేసింది. ఈ తరహా చట్టాన్నే తిరుమలలోనూ ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇక తిరుమలలో డిక్లరేషన్ విషయం కూడా అప్పుడప్పడూ రాజకీయ రచ్చకు కారణమవుతూ ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సమయంలో డిక్లరేషన్ అంశం ఏపీలో పొలిటికల్ వార్‌కు దారితీస్తు ఉంటుంది. ఈ క్రమంలోనే డిక్లరేషన్ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కూటమి సర్కారు ఆలోచిస్తోంది.


అలాగే తిరుమల శ్రీవారి ఆలయం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తిరుమలలో తరుచుగా ఏదో ఒక ఘటన వెలుగులోకి రావటం, వివాదమవ్వటం తెలిసిందే. పరకామణి చోరీ చేసు, తిరుమల లడ్డూ వ్యవహారం, దళారుల మోసాలు వంటివి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో ప్రత్యేక చట్టం అమలు చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa