ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునేవారికి గమనిక. మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఈ సారి ఫిబ్రవరి నెలలోనే అందించనున్నారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం కావటంతో.. ఫిబ్రవరి 28వ తేదీ అంటే.. శనివారం రోజునే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఒకవేళ ఏవైనా కారణాలతో ఫిబ్రవరి 28వ తేదీన పింఛన్ డబ్బులు తీసుకోలేకపోతే.. అలాంటి వారికి మార్చి రెండో తేదీన (సోమవారం) పింఛన్ సొమ్ము అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది (స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు) ద్వారా ఇంటి వద్దనే ఉదయం నుంచి పింఛన్ పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ఏపీ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా పింఛన్ అందిస్తోంది. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా రూ.4000 పింఛన్ అందిస్తున్నారు. దివ్యాంగులకు రూ.6000 పింఛన్ అందిస్తున్న ప్రభుత్వం.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10000 పింఛన్ అందిస్తోంది. ప్రతి నెలా సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దనే పింఛన్ అందించేలా చర్యలు చేపడుతోంది. అయితే నెల ఒకటో తేదీ ఏదైనా సెలవు ఉంటే.. ఆ ముందురోజే పింఛన్లు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది.
ఈ క్రమంలోనే మార్చి ఒకటో తేదీ ఆదివారం కావటంతో ఫిబ్రవరి 28వ తేదీనే పింఛన్ అందించనున్నారు. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. పింఛన్ల పంపిణీకి అనుగుణంగా వారంతా ముందుగానే బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకుని అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతినెలా ఒకటో తేదీ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా హాజరవుతూ వస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక జిల్లాలలో తన చేతుల మీదుగా పింఛన్లు అందిస్తున్నారు. ఆ కుటుంబాల బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈసారి ఏ జిల్లా పర్యటనకు వెళ్తున్నారనేదీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa