గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బెలూన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. పెదకాకానికి చెందిన నాలుగేళ్ల శిరీష బుధవారం బెలూన్‌తో ఆడుకుంటూ ఉంది. అయితే ప్రమాదవశాత్తూ బెలూన్ ఒక్కసారిగా శిరీష గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడకపోవటంతో శిరీష అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన శిరీష కుటుంబ సభ్యులు చిన్నారిని వెంటనే గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనుకోకుండా ప్రాణాలు కోల్పోవటంతో శిరీష తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
హోలీ పండగ తెచ్చిన విషాదం..
హోలీ పండుగ వేళ గన్నవరం మండలం కండ్రికలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గన్నవరం మండలం చిక్కవరం శివారు ప్రాంతమైన కండ్రికలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మోహన్ సాయి, వెంకట జోసెఫ్, వినయ్ కుమార్ అనే ముగ్గురు విద్యార్థులు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. ముగ్గురూ గొల్లనపల్లిలోని జెడ్పీ హైస్కూలులో చదువుకుంటున్నారు. అయితే హోళీ పండుగ సందర్భంగా మంగళవారం రోజు స్కూలుకు సెలవు ఇచ్చారు. దీంతో ముగ్గురు స్నేహితులూ సాయంత్రం వరకూ రంగులు జల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు.
సాయంత్రమయ్యేసరికి రంగులను శుభ్రం చేసుకునేందుకు చెరువు వద్దకు చేరుకున్నారు. అయితే చెరువు గట్టు వద్ద కాలుజారి చెరువులో పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. చనిపోయిన విద్యార్థులలో ఇద్దరు పదో తరగతి కాగా.. ఒక విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నారు. రోజూవారీ కూలీ పనులు చేసుకుంటూ వీరి కుటుంబాలు.. ముగ్గురు విద్యార్థులను చదివిస్తూ వచ్చాయి. అయితే ఇలా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు.. ఒకేసారి ప్రాణాలు కోల్పోవటం.. వారి కుటుంబాలతో పాటుగా గ్రామంలోనే తీవ్ర విషాదాన్ని నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa