ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవో 117తో గత పాలకులు విద్యావ్యవస్థను కుప్పకూల్చారని ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 09:33 PM

ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపేలా ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ను ప్రపంచానికి చాటుదామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. శాసనసభలో విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్ల ప్రతిపాదనల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో జరిగిన విధ్వంసం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను సవివరంగా వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, వాటి బలోపేతానికి కృషి చేయాలని కోరారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో కోలుకోలేని విధ్వంసం జరిగిందని లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు తీవ్రంగా నష్టపోయాయని, వ్యవస్థ మొత్తం కుప్పకూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఏకంగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని గణాంకాలతో సహా వివరించారు. డ్రాప్ బాక్సుల విధానాన్ని దుర్వినియోగం చేసి, సుమారు 3 లక్షల మంది పిల్లల పేర్లతో మధ్యాహ్న భోజనం, కిట్ల నిధులను డ్రా చేసుకున్నారని ఆరోపించారు. కేవలం నంబర్లను మేనేజ్ చేయడానికే గత పాలకులు పరిమితమయ్యారని మండిపడ్డారు.గత ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు  దారుణంగా పడిపోయాయని మంత్రి తెలిపారు. 2018లో 5వ తరగతి పిల్లలు గ్రేడ్-2 తెలుగును 57 శాతం మంది అర్థం చేసుకోగలిగితే, గత ప్రభుత్వంలో అది 37 శాతానికి పడిపోయిందన్నారు. నేషనల్ ఎచీవ్ మెంట్ సర్వేలో 3వ తరగతి లాంగ్వేజ్ విభాగంలో ఏపీ 1వ ర్యాంకు నుంచి 27వ ర్యాంకుకు, మ్యాథ్స్ లో 5వ ర్యాంకు నుంచి 21వ ర్యాంకుకు పడిపోవడం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద కాపలాకు పెట్టి అవమానించారని, ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.విశ్వవిద్యాలయాలను గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిందని మంత్రి ధ్వజమెత్తారు. వర్సిటీల్లో ఫ్యాకల్టీ నియామకాలను గాలికొదిలేసి, వీసీలుగా బంధువులను, అర్హత లేనివారిని నియమించి భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఏయూ వీసీగా ప్రసాదరెడ్డిని నియమించి విద్యార్థులను రోడ్లపై నిలబెట్టారని, అర్హత లేకపోయినా మాజీ సీఎం బంధువు సుందరవల్లిని ఎస్వీయూ రెక్టార్ గా, విక్రమ సింహపురి వర్సిటీ వీసీగా నియమించారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి వంటి బంధువర్గానికి పదవులు కట్టబెట్టారని పేర్లతో సహా బయటపెట్టారు. వర్సిటీల్లో విగ్రహాలు పెట్టి, ఫ్లెక్సీలు కట్టి పవిత్రతను దెబ్బతీశారన్నారు. అంతేకాకుండా రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిపోయారని తెలిపారు.కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో ప్రక్షాళన మొదలైందని లోకేశ్ తెలిపారు. జీవో 117 రద్దు చేసి, సింగిల్ టీచర్ విధానానికి స్వస్తి పలికామన్నారు. కేవలం 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల పోస్టుల భర్తీ చేపట్టామని గుర్తుచేశారు. మరోవైపు యూనివర్సిటీల్లోని న్యాయపరమైన చిక్కులను 90 రోజుల్లో తొలగించి, త్వరలోనే అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్ల సరఫరాలో అవినీతిని అరికట్టి రూ.1,000 కోట్లు ఆదా చేస్తున్నామని, ఈ నిధులను విద్యార్థుల సంక్షేమమేకే వెచ్చిస్తామని స్పష్టం చేశారు.ప్రతి ఎమ్మెల్యే తమ పరిధిలోని రెండు పాఠశాలలను దత్తత తీసుకోవాలని, ప్రతి వారం స్కూళ్లను సందర్శించి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని మంత్రి కోరారు. పిల్లల్లో 'పాసివ్ లెర్నింగ్' నుంచి 'యాక్టివ్ లెర్నింగ్' వైపు మార్పు తెచ్చేందుకు 'క్లిక్కర్ టెక్నాలజీ'ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. అమరావతిలో ప్రపంచస్థాయి సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం శోభా రియాలిటీ సంస్థ రూ.100 కోట్లు విరాళం అందించిందని సభకు తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు గారి సలహాలతో పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, అందరం కలిసి ఏపీని విద్యాహబ్‌గా మారుద్దామని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa