ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మాస్క్ లతో రిస్క్ తప్పదటా

international |  Suryaa Desk  | Published : Mon, Jan 10, 2022, 11:48 PM

మేం మాస్క్ పెట్టుకొన్నాం మాకు ఎలాంటి భయంలేదు అన్న  మాటలు కట్టిపెట్టాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మీరు వాడే మాస్క్ కూడా ఎంతవరకు శ్రేయస్కరం అని వారు పేర్కొంటున్నారు. వ్యాప్తిని అడ్డుకోవాలంటే వ్యాక్సిన్లతో పాటు మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు గత రెండేళ్లుగా చెబుతూనే ఉన్నారు. వాస్తవానికి కరోనా వైరస్ నుంచి రక్షించడంలో మాస్క్‌లు అత్యంత కీలకమైనప్పటికీ.. ప్రస్తుతం ఇవి కూడా ఫ్యాషన్‌ ముద్ర వేసుకున్నాయి. దీంతో విభిన్నమైన రంగుల్లో మళ్లీ ఉపయోగించే క్లాత్‌ మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మరి వీటి వల్ల ప్రయోజనం ఉంటుందా? అంటే లేదనే సమాధానం వస్తుంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో సింగిల్‌ లేయర్‌ మాస్క్‌లను వాడకపోవడమే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల కేవలం 20 నిమిషాల్లోనే వైరస్‌ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ల వినియోగంపై అమెరికన్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ గవర్నమెంటల్‌ ఇండస్ట్రియల్‌ హైజీనిస్ట్‌తో పాటు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) పలు అధ్యయనాలు చేపట్టింది. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించకుండా ఆరు అడుగుల దూరంలో నిలబడితే.. అందులో ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌ ఉంటే.. అప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్‌ సోకుతుంది. ఒకవేళ ఇద్దరిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మాస్క్‌ లేకుండా.. అవతలి వ్యక్తి క్లాత్‌ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్‌ 20 నిమిషాల్లో సోకుతుంది. ఇక, ఇద్దరూ క్లాత్‌ మాస్క్‌లు ధరిస్తే గనుక.. 27 నిమిషాల్లో వైరస్‌ వ్యాపిస్తుంది. ఒకవేళ ఇద్దరిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మాస్క్‌ లేకుండా.. అవతలి వ్యక్తి కేవలం సర్జికల్‌ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్‌ 30 నిమిషాల్లో మరో వ్యక్తికి సోకుతుంది. అదే ఇద్దరిలో ఒకరు ఎన్‌95 మాస్క్‌ ధరించి.. మరో వ్యక్తి పూర్తిగా మాస్క్‌ పెట్టుకోకపోతే కనీసం 2.5 గంటల్లో వైరస్‌ వ్యాపిస్తుంది. ఇద్దరూ ఎన్‌95 మాస్క్‌లు ధరిస్తే.. వైరస్‌ వ్యాప్తి చెందడానికి కనీసం 25 గంటల సమయం పడుతుందని అధ్యయనంలో తేలింది. సింగిల్‌ లేయర్‌ క్లాత్ మాస్క్‌లు వైరస్‌లను మోసుకెళ్లే పెద్ద పెద్ద తుంపరలను అడ్డుకోగలవుగానీ, చిన్న చిన్న ఏరోసెల్స్‌ను బ్లాక్‌ చేయడంలో సమర్థంగా పనిచేయవని అధ్యయనం తెలిపింది. అయితే, ధ్రువీకరించిన ఎన్‌95 మాస్క్‌లు మాత్రం గాలిలోని 95 శాతం అణువులను వడబోయగలవని పేర్కొంది. కానీ, చాలా మంది ఫ్యాషన్‌ కోసమో లేదా తిరిగి వినియోగించే వీలు ఉంటుందనే క్లాత్‌ మాస్క్‌లను వినియోగిస్తుంటారు. అలాంటప్పుడు వాటిని సర్జికల్‌ మాస్క్‌లతో కలిపి ధరిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగానీ, ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోన్న ఈ సమయంలో కేవలం క్లాత్‌ మాస్క్‌ లేదా సర్జికల్ మాస్క్‌ ఒకటే పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అయితే, కొంతమంది నిబంధనల కోసం మాస్క్‌లు ధరిస్తున్నప్పటికీ వాటిని గడ్డం కిందకు వేలాడేస్తున్నారు. అలాంటప్పుడు ఏ రకం మాస్క్‌ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరించే మాస్క్‌ తప్పకుండా ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. క్లాత్ మాస్క్ కంటే సర్జికల్ మాస్క్‌లు మేలని, ఈ రెండికంటే ఎన్95 ఉత్తమమని అధ్యయనంలో వెల్లడయ్యింది. రెండు లేదా మూడు డోస్‌ల టీకా వేసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ వదలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్నా తప్పనిసరిగా మాస్క్ ధరించడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa