ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహిస్తాం: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

national |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 07:02 PM

ఐపీఎల్-2022 నిర్వహణపై ఇటీవల కాలంలో పలు సందేహాలు, చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. కరోనా దృష్ట్యా స్వదేశంలో ఐపీఎల్ నిర్వహించలేరేమోననే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఊహాగానాలన్నింటినీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పటాపంచలు చేశాడు. ఐపీఎల్‌ను మన దేశంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. అయితే ఐపీఎల్ నిర్వహణ సమయంలో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు.


'ఐపీఎల్​-2022ను భారత్​లోనే నిర్వహిస్తాం. కరోనా కేసులు తారస్థాయికి చేరకపోతే.. సద్వేశంలోనే పోటీలు ఉంటాయి. ముంబయి, పుణెలలోనే మొత్తం మ్యాచులు ఉంటాయి. నాకౌట్​ దశకు సంబంధించి వేదికను త్వరలోనే ఖరారు చేస్తాం' అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్నాడు.


కరోనా కేసులు ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న తరుణంలో స్వదేశంలో ఐపీఎల్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రికెట్ అభిమానులు సైతం వేదిక మారుతుందనే భావించారు. అయితే స్వదేశంలోనే జరుగుతుందనే గంగూలీ ప్రకటనతో క్రికెట్ అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


ఇదిలా ఉండగా ఐపీఎల్‌- 2022కు సంబంధించి త్వరలో ఆటగాళ్లకు మెగావేలం నిర్వహించనున్నారు. బెంగళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో మెగావేలం జరగనుంది. వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేసింది. మెగావేలంలో మొత్తం 590 మంది క్రికెటర్లు రానున్నారు. ఈ ఏడాది కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు ఐపీఎల్‌లో పాల్గొననున్నాయి. తమ అభిమాన క్రికెటర్లు ఏయే జట్ల గూటికి చేరతారోననే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa