ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మెలు, ప్రదర్శనల వల్ల ఏం సాధిస్తారు: సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 07:41 PM

మెరుగైన పీఆర్సీ కోసం పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమస్య పరిష్కరించుకోవాలనే ఉద్దేశం ఉద్యోగులకు లేదని అన్నారు. సమ్మెలు, ప్రదర్శనల వల్ల ఏం సాధిస్తారని ప్రశ్నించారు. చర్చలకు ఉద్యోగులను ప్రతి రోజూ ఆహ్వానిస్తున్నామని, వారి కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. అయితే వారు రావట్లేదని పేర్కొన్నారు.
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గురువారం భారీ ప్రదర్శన, సమ్మె చేపట్టడంపై సజ్జల స్పందించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మీడియాతో మాట్లాడారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. వరుసగా చర్చలకు పిలుస్తున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించినా ఉద్యోగులు అర్థం చేసుకోలేదని వివరించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తల్లకిందులైందని పేర్కొన్నారు. దీనిని అర్థం చేసుకోకుండా సమ్మె చేపడితే ప్రయోజనమేమిటని అన్నారు. నిరసనల్లో ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
నూతన పీఆర్సీని రూపొందించిన విధానాన్ని ఉద్యోగులకు ప్రభుత్వం కూలంకషంగా వివరించిందని సజ్జల తెలిపారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు సముచిత ప్యాకేజీని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తాము ప్రకటించిన దాని కంటే పీఆర్‌సీ నుంచి ఎక్కువగా ఆశించటం వల్లే ఉద్యోగుల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు. తమది ఉద్యోగులకు మేలు చేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జాప్యం లేకుండా జీతాలు చెల్లిస్తున్నామన్నారు. తక్కువ జీతాలతో పని చేస్తున్న అంగన్‌వాడీలకు, ఆశా, మున్సిపల్ వర్కర్లకు గత ప్రభుత్వాల కంటే ఎక్కువ జీతాలిచ్చామని గుర్తు చేశారు. ఉద్యోగులు కోరినంత చేయడం ప్రస్తుతం సాధ్యం కాదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa