ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలుకలను చంపేందుకు ఓ తల్లి వేసిన ఎర కూతురి ప్రాణం తీసింది

national |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 12:32 PM

కొన్ని సందర్భాల్లో తెలిసోతెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఎలుకలను చంపేందుకు ఓ తల్లి వేసిన ఎర కూతురి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరు జిల్లాలోని సెంకుట్టైపాళయం ప్రాంతంలోని బోయర్ వీధికి చెందిన శాంతి గ్రేసీ అనే మహిళ తన ఇంటి ముందు కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. శాంతికి ఎమిమా జాక్లిన్ అనే 19 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. ఆ యువతి పొలాచ్చి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్‌లో బీకామ్ ఫైనలియర్ చదువుతోంది. కాలేజీకి వెళ్లి వచ్చి ఇంట్లో పనులు కూడా చూసుకుంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉండేది. తల్లి కిరాణా దుకాణం చూసుకుంటూ ఉంటే ఇంటి పని, వంట పని కూతురు చూసుకునేది. ఇలా సాఫీగా సాగిపోతున్న ఈ తల్లీకూతురి జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దుకాణంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో వాటిని చంపేందుకు కొన్ని క్యారెట్లలో ఎలుకల మందు కలిపి షాపులో ఉంచింది. ఆ విషయం తెలియని కూతురు.. తల్లి సరుకులకు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో ఉన్న క్యారెట్లతో కలిపి వీటిని కూడా వండేసింది. ఆ క్యారెట్లలో ఒక క్యారెట్‌ను కూడా తిన్నది. అంతేకాదు.. తల్లి వచ్చేలోపు ఆ క్యారెట్ కూర తిన్న జాక్లిన్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు అనిపించి వాంతులు కావడంతో కూతురిని హుటాహుటిన తల్లి శాంతి పొలాచ్చి గవర్నమెంట్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించింది. చికిత్స తీసుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగుపడటంతో ప్రాణాపాయం తప్పిందని తల్లీకూతురు ఇంటికి చేరుకున్నారు.


అయితే ఫిబ్రవరి 1న కూడా మరోసారి ఆమె అనారోగ్యం బారిన పడింది. జాక్లిన్‌కు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో పొలాచ్చి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. రాత్రి 11 గంటల సమయంలో చికిత్సకు స్పందించకపోవడంతో జాక్లిన్ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం బుధవారం సాయంత్రం పోలీసులకు అప్పగించారు. ఎలుకల కోసం పెట్టిన క్యారెట్లను కూర వండుకుని తినడంతో 19 ఏళ్ల యువతి ఇలా అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయింది. ఆ తల్లి క్యారెట్లలో ఎలుకల మందు కలిపిన విషయం కూతురికి చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కూతురిని తానే చంపేశానని ఆ తల్లి విలపించిన తీరు చూపరులను కలచివేసింది. ఆ యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa