ఏజెన్సీలో మద్యం ఏరులైపారుతోంది. గ్రామ గ్రామాన బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఒడిశా నుంచి మద్యం దిగుమతి చేసుకుని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. మరోవైపు విచ్చలవిడిగా సారా తయారు చేస్తూ, అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతోపాటు మందుబాబుల జేబులు ఖాళీ అవుతున్నాయి. గిరిజనుల జీవితాలు చిత్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎస్ఇబి అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేపట్టి, చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.
కురుపాం మండలంలో గత రెండేళ్లుగా ఒడిశా మద్యం, సారా ఏరులై పారుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రేటు అధికం కావడంతో ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి, గిరిజన గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో రాయగడ, సందుబడి నుంచి ఎక్కువగా మద్యం రవాణా అవుతోంది. 2020 సంవత్సరంలో కరోనా లాక్ డౌన్ కారణంగా కొద్దిరోజులు ప్రభుత్వం మద్యం అమ్మకాలు నిలిపేసింది. దీంతో ఒడిశా నుంచి మద్యం దిగుమతి చేసుకునే సంస్కృతికి తెరదీశారు. ఇప్పుడు ప్రభుత్వ దుకాణాలు తెరిచి అమ్మకాలు చేస్తున్నా ధరలు రెట్టింపు కావడం, మందుబాబులకు నచ్చిన బ్రాండ్లు దొరక్కపోవడంతో ఒడిశా మద్యంపై దృష్టి సారిస్తున్నారు. మండలానికి ఒడిశా బోర్డర్ కావడంతో ద్విచక్రవాహనాలపై ఆ రాష్ట్రానికి వెళ్లిన పలువురు మద్యం బాటిళ్లు తెచ్చి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో దీనిని పలువురు వృత్తిగా మలుచుకుంటున్నారు. దీని ప్రభావంతో గ్రామగ్రామాన బెల్టుషాపులు వెలిశాయి. ఇతర రాష్ట్రాల మధ్యం కూడ భారీగా పట్టుబడ్డ దాఖలాలున్నాయి. ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకం చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
కుటీర పరిశ్రమగా సారా తయారీ
ఏజెన్సీలో సారా తయారీ కుటీర పరిశ్రమగా సాగుతోంది. గిరిజన గ్రామాల్లో ఎక్కడికక్కడ భారీగా సారా తయారు చేస్తూ, అమ్మకాలు సాగిస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో పూర్తిస్థాయిలో పనులు ఖాళీగా ఉన్నవారిలో చాలా మంది సారా అమ్మకాలపై దృష్టి సారించారు. మరికొంతమంది ఒడిశా నుంచి దిగుమతి చేసుకుని, విక్రయాలు సాగిస్తున్నారు. ఇతరత్రా వ్యాపారాలు సాగకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వం మద్యం ధరలు అధికంగా పెంచడం మరో కారణం. ఒకవైపు ఆదాయం కోల్పోయి మరోవైపు అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయలేక మందుబాబులు సారా వైపు మొగ్గు చూపారు. ఎక్కువమంది సారా పై ఆధారపడటం చూస్తున్న పలువురు లాభాలు కురిపిస్తున్న సారా అమ్మకాలపై దృష్టిసారించారు. ఇటీవల కాలంలో పట్టుబడుతున్న వారే అందుకు నిదర్శనం.
అరికట్టలేని అధికారులు
అక్రమ మద్యం, సారా అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మరోవైపు దీనివల్ల గిరిజన కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. గిరిజనులు ఆరోగ్యాలు పాడుచేసుకున్నారు. అయినా, మద్యం, సారా అమ్మకాలను అరికట్టడంలో అధికారులు. విఫలమయ్యారని చెప్పక తప్పదు. మండలంలో కొన్ని గిరిజన గ్రామాల్లో సర్కారు మద్యం అంటే తెలియని పరిస్థితి ఉంది. సారా విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టడం వల్ల ప్రభుత్వ మద్యం వైపు వెళ్లడం లేదు. గిరిజన ప్రాంతాల్లో రోజుకు సుమారు 2 వేల లీటర్ల సారా తయారు చేస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఎస్ఇబి బృందాలు పలుమార్లు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టారు. బెల్లంఊట మాత్రమే ధ్వంసం చేశారు తప్ప నిర్వాహకులకు పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా చేసుకొని సారా తయారీ దారులు సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు అక్రమ మద్యం, సారా అమ్మకాలపై దృష్టిసారించి, అరికట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa