యూనివర్సిటీ స్థాయి చదువుల నుంచే విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన పెరగాల్సిన అవసరం ఉందనీ, దీనివల్ల శాంతియుత సమాజ స్థాపన సులభతరమవుతుందని అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ప్రెసిడెంట్ రాధేశ్యాం దాస్ అన్నారు. యుక్త వయస్సులోనే దైవత్వంపై నమ్మకం పెరిగితే ఆయా విద్యార్థులు అన్నింటా విజయసోపానాలు అధిరోహించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, లలిత కళలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నం అనిర్వచనీయమని కొనియాడారు. విదేశీ విద్యార్థులకు ఇండియన్ ఇమ్మర్షన్ ప్రోగ్రాం కింద భారతీయ వారసత్వం, కళల్ని వివరించే ప్రత్యేక కోర్సుల నిర్వహణ కోసం ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 'ఆదిగ్యాన్' పేరిట సరికొత్త వెబ్ సైట్ ను రూపొందించింది. శనివారం ఉదయం దృశ్యమాధ్యమ పద్ధతిలో 'ఆదిగ్యాన్' ప్రారంభ కార్యక్రమం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులుగా వర్చువల్ పద్ధతిలో హాజరైన రాథేశ్యాం దాస్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.
ముందుగా ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వజ్జా సాంబశివరావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమ్ కుమార్, డీన్ బీవీ బాబు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసోసియేటెడ్ డైరెక్టర్ డాక్టర్ నాగశ్వేతలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ ఎస్ఆర్ఎంలో మాడ్యులర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించనున్నామని, రానున్న రోజుల్లో సంగీతం, నాట్యం, యోగా, ధ్యానం వంటి అంశాల్లో ప్రత్యేక కోర్సులను నిర్వహించనున్నామన్నారు. అనంతరం వైస్ ఛాన్సలర్ వెబ్సైట్ ప్రోమోను ప్రారంభించారు. ప్రఖ్యాత యోగా, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తనయ, ఈశా ఫౌండేషన్ కార్యదర్శి రాథే జగ్గీ మాట్లాడుతూ, ఎంతో ప్రాచీనమైన భారతీయ నాట్య శాస్త్రానికి మరింత ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజినీరింగ్, లా, సైన్స్ విశ్వవిద్యాలయాలు నాట్య శాస్త్రంలో ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలని సూచించారు. అంతర్జాతీయ నాట్య కళాకారిణి ప్రతిక్షా కాశి మాట్లాడుతూ, ఉపనిషత్తులు, వేదాలు, మహాకావ్యాల్లో నాట్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారనీ, విద్యాసంస్థలు కూడా ఇదే తరహాలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాట్యం వల్ల మానవ దేహానికి ఎన్నో ప్రయోజనాలు ఒనగూరతాయనీ, ఒత్తిడి తగ్గి ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు బ్రహ్మకుమారి శివానీ మాట్లాడుతూ, దైవత్వం ఉట్టి పడే ఆధ్యాత్మిక ప్రవచనాల వల్ల విద్యార్థుల్లో శాంత స్వభావం పెరుగుతుందన్నారు.
భావోద్వేగాలను నియంత్రించుకునే గుణం అలవడుతుందన్నారు. జ్ఞాననేత్రంతో చూడగలిగే శక్తి పెరుగుతుందన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో రామకృష్ణమఠం ప్రతినిధి స్వామీ బోధమయానంద, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి రాజీవ్ నంబియార్, డాక్టర్ రేవంత్ విక్రం సింగ్, నృత్యాంజలి వ్యవస్థాపకులు డాక్టర్ తుషార్ గుహ, టెంపుల్ డాన్స్ ఛైర్మన్ కాట్రగడ్డ మిమానీ తదితరులు ప్రసంగించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పంపిన మెసేజ్ ను డాక్టర్ నాగశ్వేత చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఐటీకేఎం డైరెక్టర్ డాక్టర్ మోహన్, డీన్ బీవీ బాబు, ఎస్ ఎన్ పాండా, రేవతీ బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa