మతం ఆధారంగా ట్రోల్స్ చేసే వారు నిజమైన భారతీయులు కాదని, నిజమైన అభిమానులు కాదని టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఆ ఓటమితో అభిమానులు జట్టుపై దారుణమైన ట్రోల్స్ చేశారు. మహ్మద్ షమీపై మరీ దారుణంగా విరుచుకుపడ్డారు. 3.5 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్న అతడిని పాకిస్థాన్ ఏజెంట్ అంటూ విమర్శలు గుప్పించారు. బీసీసీఐ, నాటి కెప్టెన్ కోహ్లీ సహా అందరూ ఆ ట్రోల్స్ ను ఖండించారు. షమీ మాత్రం దానిపై ఏమీ మాట్లాడలేదు. ఆ ఘటన జరిగిన 4 నెలల తర్వాత తాజాగా అతడు నోరు విప్పాడు. తనను విమర్శించిన వారిపై మండిపడ్డాడు. మతం ఆధారంగా ట్రోల్స్ చేసే వారు నిజమైన భారతీయులు కాదని, నిజమైన అభిమానులు కాదని అన్నాడు. అలాంటి విషపూరితమైన ఆలోచనలకు విరుగుడు లేదన్నాడు. ఓ ఆటగాడిని హీరోగా భావించి.. ఆ తర్వాత ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే నిజమైన భారత అభిమాని అనిపించుకోడని వ్యాఖ్యానించాడు. తన మీద విమర్శలు చేసిన వాళ్లంతా అడ్రస్ లేనివాళ్లని, టీమిండియా ఆటగాడిగా అలాంటి వారి గురించి స్పందించి టైం వేస్ట్ చేసుకోదలచుకోలేదని చెప్పాడు. తామేంటో తమకు తెలుసని, దేశం గురించి ఆడుతున్న తమకు ఇండియా అంటే ఏంటో తెలుసని పేర్కొన్నాడు. దేశం కోసమే తాము పోరాడుతున్నామని స్పష్టంచేశాడు. విమర్శలు చేసిన వాళ్లకు తామేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయవద్దని కోరాడు. ఎవరినైనా రోల్ మోడల్ అని తాను అనుకుంటే.. ఆ వ్యక్తి గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించనని, అదే తన మైండ్ లో ఉంటుందని తెలిపాడు. తనను గాయపరిచేలా కామెంట్ చేసేవాళ్లు తన అభిమానులు కాదని, భారత అభిమానులూ కాదని చెప్పాడు. అలాంటి వ్యక్తులు ఏమన్నా తాను పట్టించుకోనని షమీ అన్నాడు. పుజారాపైనా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కనీసం 100 నుంచి 200 బంతులాడేదాకా అతడు నిద్రపోడని, బౌలర్లను అతడిలా విసిగించే బ్యాటర్ ఎవరూ లేరని సరదాగా చెప్పాడు. అతడికి బౌలింగ్ చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదన్నాడు. బీసీసీఐ తమకు డబ్బులిస్తోందని, కాబట్టి ఇష్టాయిష్టాలతో ఇక్కడ పని ఉండదని పేర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను తొలిసారి చూసినప్పుడు వింతగా అనిపించిందన్నాడు. అలాంటి యాక్షన్ తో అంత వేగంగా బంతులెలా విసురుతున్నాడా? అని ఆశ్చర్యపోయానని వివరించాడు. బంతిపై అతడికి ఉండే నియంత్రణ వల్లే అది సాధ్యమవుతుందని చెప్పాడు. అతడు సంధించే యార్కర్లు తనకెంతో ఇష్టమన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa