కృష్ణా జిల్లా బీ.జే.పీ నాయకుడు మల్లారెడ్డి హత్య కేసు ఒక కొలిక్కివచ్చింది. ఈ కేసులో నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర జ్యోతి లో వచ్చిన కథనం ప్రకారం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకెల మల్లారెడ్డి ఫిబ్రవరి 18న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వియ్యంకుడు పుల్లారెడ్డి ప్రమేయం ఉండొచ్చుననే అనుమానాలను అప్పట్లోనే మల్లారెడ్డి బంధువులు, బీజేపీ నాయకులు వ్యక్తం చేశారు. సుమారు 11 రోజుల తర్వాత ఎట్టకేలకు వత్సవాయి పోలీసులు బుధవారం ఈ హత్యకేసులో ఐదుగురు నిందితుల అరెస్టు చూపించారు. చిట్టేల గ్రామ మాజీ సర్పంచ్, ఎమ్మెల్యే ఉదయభాను వియ్యంకుడైన మారెళ్ల పుల్లారెడ్డిపై బీజేపీ నేత మల్లారెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతుండడం, మద్యం సేవించి ఇంటిపైకి వచ్చి చంపుతానని బెదిరిస్తుండడమే హత్యకు కారణమని వత్సవాయి ఎస్పై మహాలక్ష్ముడు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వత్సవాయి మండలం చిట్టేల గ్రామానికి చెందిన వైసీపీ నేత మారెళ్ల పుల్లారెడ్డిపై బీజేపీ నేత మల్లారెడ్డి కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టింగులు పెడుతున్నారు. పుల్లారెడ్డి సోదరుడు సూరారెడ్డి ఇంటిపైకి వెళ్లి రాళ్లు విసిరి చంపుతానని బెదిరించారు. ఆపేందుకు వెళ్లిన సూరారెడ్డి అనుచరులు దేవిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి (32), వేల్పుల రాజశేఖర్‌రెడ్డి (26), గోపు గోపీ (30), కొలగాని రామయ్య(38)లను కూడా చంపేస్తానని బెదిరించటంతో వారంతా మల్లారెడ్డిపై కక్షగట్టారు.
ముందు పని కానివ్వండి.. తర్వాత చూద్దాం..మల్లారెడ్డిని హతమార్చేందుకు అవసరమైన ఆర్థికసాయం కోసం ఉదయభాను వియ్యంకుడి తమ్ముడు సూరారెడ్డితో మాట్లాడారు. దీనికి సూరారెడ్డి.. ‘ముందు పని కానివ్వండి తర్వాత చూద్దాం..’ అని హామీ ఇవ్వడంతో మల్లారెడ్డిని హత్య చేసేందుకు వారు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కిరాయి హంతకులతో రూ.14 లక్షలకు సుపారీ మాట్లాడిన ప్రవీణ్ రెడ్డి రూ.4లక్షలు అడ్వాన్స్‌గా ముఠా నాయకుడు సుందర్‌రావుకు ఇచ్చారు. మల్లారెడ్డిని హతమార్చేందుకు ప్రవీణ్‌రెడ్డి కారును వినియోగించారు. హత్య కోసం ఆరు మొబైల్ ఫోన్లు కొని, రెండు ఫోన్లను కిరాయి ముఠా, నాలుగు ఫోన్లు ప్రవీణ్‌రెడ్డి వాడారు. ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి వత్సవాయిలో పార్టీ సమావేశం సందర్భంగా మల్లారెడ్డి బ్యానర్లు, జెండాలు కట్టి బైక్‌పై ఇంటికి వెళుతుండగా, వేల్పుల రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫోన్ సమాచారంతో ప్రవీణ్ కిరాయి హంతకులను తీసుకుని లింగాల వద్ద మునేటి కాజ్‌వే వద్ద కాపుకాశారు.
కాజ్‌వే దాటాక మల్లారెడ్డి బైక్‌ను వెనుక నుంచి కారుతో ఢీ కొట్టించారు. కింద పడిన మల్లారెడ్డి పొలాల్లోకి పారిపోతుండగా, వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. అనంతరం కిరాయి ముఠాను అదే కారులో నరసరావుపేటలో దింపేశారు. ఫోన్ కాల్స్, సిగ్నల్స్ ద్వారా నిందితులను గుర్తించామని, హంతక ముఠాలోని తురుమెల్ల చెంచారావు, తదితరులు డీల్ ప్రకారం మిగిలిన డబ్బు కోసం కోదాడ సమీపంలో మాట్లాడుకుంటుండగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
మొత్తం 11 మంది మల్లారెడ్డి హత్య కేసులో 11మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఐదుగురిని అరెస్టు చేశామని, మిగిలినవారిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాజకీయ కోణం లేదని, పాత కక్షలే హత్యకు దారి తీశాయని పేర్కొన్నారు. సంచలనం కలిగించిన ఈ కేసులో మల్లారెడ్డి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 302, రెడ్ విత్ 34 కింద వత్సవాయి ఎస్సై మహాలక్ష్ముడు కేసు నమోదు చేయగా, జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేశారు. కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు సీసీఎస్ డీఎస్పీ ఎం.మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐ బాలశౌరి, ఎస్సై వెంకటేశ్వరరావు, ఎస్బీ ఎస్సై జనార్దన్, జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, సర్కిల్ ఎస్సైలను మూడు టీంలుగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa