దేశంలో చాలా మంది యువకులు పెళ్లీడు వచ్చినా ఏకాకిగానే ఉంటున్నారు. పొట్ట, బట్టతల వస్తుండడంతో పెళ్లి చూపుల్లో అమ్మాయిల తిరస్కారానికి గురవుతున్నారు. తాజాగా ఓ యువకుడు తనకు వయసు మీద పడుతున్నా పెళ్లి కావడం లేదని బెంగ పెట్టుకున్నాడు. పెళ్లి అయ్యేందుకు సలహా ఇవ్వాలని మాంత్రికుడిని ఆశ్రయించాడు. అతడి సూచనతో ఆ యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
యూపీలోని నోయిడా పరిధి చిజార్సీ గ్రామంలో సోను బాల్మీకి అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడికి మూడు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి కాలేదు. కొందరికి అతడు నచ్చకపోతే, ఇంకొందరిని అతడు తిరస్కరిస్తూ వచ్చాడు. ఇటీవల కాలంలో ఎక్కడ పెళ్లి చూపులు వెళ్లినా అమ్మాయిల తిరస్కారానికి గురవుతూ వచ్చాడు. ఎలాగైనా తక్షణమే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా మాంత్రికుడికి వద్దకు వెళ్లాడు. ఓ బాలికను హోలీ పండుగ నాడు బలి ఇస్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుందని మాంత్రికుడు సలహా ఇచ్చాడు. మాంత్రికుడి సూచనతో తమ ఇంటి ఎదురుగా ఉన్న బాలికను మాయ మాటలు చెప్పి మంగళవారం కిడ్నాప్ చేశాడు. ఓ ఇంట్లో బందీగా ఉంచాడు.
ఇక తమ కుమార్తె కనిపించడకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇరుగుపొరుగు ఇళ్లలోనూ, బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఆధారంగా కొందరు అనుమానితులను పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించడంతో కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. చివరికి బాలికను బలి ఇవ్వడానికి ముందు ఓ గదిలో బంధించాడని తెలుసుకుని, అమ్మాయి విడిపించారు. నిందితులపై కేసు నమోదు చేసి, కటకటాల్లోకి పంపించారు.