దేశానికి సంబంధించిన ఏ అంశమైనా సరే ఆ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావడం సహజం. కానీ ఇతర దేశాల విషయంలో ఒక దేశంలోని పార్టీలు ఏకం కావడం చాలా అరుదు. కానీ అమెరికాలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పుతిన్ ను ఒంటరిని చేసేందుకు.. రెండు భిన్న ధ్రువాలు ఏకమయ్యాయి. సెనేట్ లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు కలిసిపోయి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై మండిపడ్డారు. ఆయనో ‘యుద్ధ నేరస్థుడు’ అంటూ ఆ దేశ ఎగువ సభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఏకతాటిపైకి వచ్చి పుతిన్ తీరును ఖండించారు. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రష్యా సైన్యం పాల్పడిన యుద్ధ నేరాల మీద దర్యాప్తు చేయించాల్సిందిగా హేగ్ లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ), ఇతర దేశాలకు ఆ తీర్మానం ద్వారా సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ ప్రజలపై సృష్టిస్తున్న అరాచకాల నుంచి పుతిన్ తప్పించుకోలేకుండా డెమొక్రాట్లు, రిపబ్లికన్లందరం ఏకతాటిపైకి వచ్చామని డెమొక్రాటిక్ సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షూమర్ అన్నారు.