ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని అభ్యంతరాలు వినిపించినా ఏపీ ప్రభుత్వం అనుకున్నది చేసింది. సోమవారం నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అధికారికంగా ప్రారంభమైంది. అధికారికంగా ఈ జిల్లాల ఏర్పాటు ప్రారంభం కాగా.. కొద్ది గంటల్లోనే భూముల మార్కెట్ విలువను పెంచేందుకు రిజిస్ట్రేషన్ ఫీజుల నమోదు ప్రారంభమైంది. కొన్ని జిల్లా కేంద్రాలు, శివారు ప్రాంతాల్లో మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం అనుమతించింది.
పాత జిల్లా కేంద్రాలతో సంబంధం లేకుండా.. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలు, శివారు ప్రాంతాల్లో భూముల మార్కెట్ ధరలను ప్రభుత్వం పెంచింది. కొత్తగా ఏర్పాటైన 11 జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువ పెరిగింది. ఈ పెంపు బుధవారం నుంచి కూడా అమల్లోకి రానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం సహజంగానే ఊపందుకుంది. దీన్ని క్యాష్ చేసుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.