గుడివాడ అమర్నాథ్, వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. జగన్ కు వీర విధేయుడు. విశాఖ జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ గుడివాడ అమర్నాథ్. విశాఖ జిల్లా నుంచి సీఎం జగనకు అత్యంత సన్నిహితుడిగా అమర్నాథ్ కు పేరుంది. తాజాగా అయన్ను మంత్రి పదవి వరించింది.
గుడివాడ అమర్‌నాథ్ 22 జనవరి 1985లో అనకాపల్లిలో గుడివాడ గురునాథరావు, నాగమణి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి గుడివాడ గురునాథ రావు మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశాడు. అమర్‌నాథ్ బీటెక్ చదివారు. మొదట కాంగ్రెస్ పార్టీలో పని చేసిన అమర్‌నాథ్ 2006లో తన 21వ ఏటనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా గెలిచాడు. ఆ తర్వాత విశాఖ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా పని చేశాడు. 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడంతో పాటు అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గా పని చేశారు.
2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోవింద సత్యనారాయణ పై 8,169 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అనకాపల్లి పార్లమెంట్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను పార్టీ నియమించింది.