కొద్ది రోజులుగా పాకిస్థాన్‌లో కొనసాగిన రాజకీయ హైడ్రామాకు శనివారం అర్ధరాత్రి తెరపడింది. పీటీఐ పార్టీ అధినేత, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సర్కారు కుప్పకూలింది. 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 174 ఓట్లు వచ్చాయి. దీంతో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగారు. ఆయన స్థానంలో ప్రతిపక్షాలన్నీ షెహబాజ్ షరీఫ్(70)ను కొత్త ప్రధానిగా ప్రతిపాదిస్తున్నాయి. పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడుగా ఉన్న ఆయనను సోమవారం మధ్యాహ్నం ప్రతిపక్ష ఎంపీలు సమావేశమై ప్రధానిగా ఎన్నుకోనున్నారు. అయితే వీరికి పోటీగా ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ తమ నేత మహ్మద్ ఖురేషీని ప్రధాని పదవికి పోటీలో ఉంచింది. దీంతో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ షెహబాజ్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. నయా పాకిస్థాన్ అనే నినాదంతో 2018 ఆగస్టు 18న ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే 1,332 రోజులు మాత్రమే ప్రధాని పదవిలో కొనసాగారు. 2023 ఆగస్టులో మళ్లీ సాధారణ ఎన్నికలు పాక్‌లో జరగనున్నాయి. మరో 16 నెలల పదవీకాలం ఉండగానే అవిశ్వాస తీర్మానంలో ఓడి, ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ వైదొలగారు.