తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల తోపులాటపై టీటీడీ స్పందించింది. భక్తులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కోవిడ్‌కు ముందున్నట్లే నేరుగా తిరుమలకు రావొచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్దకు భక్తులు భారీగా తరలి వచ్చారు. చాలా మంది క్యూలైన్లలో రెండు రోజులుగా నిరీక్షిస్తున్నారు. తిరిగి టికెట్ల కౌంటర్ తెరవడంతో ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈ ఘటనలో చిన్నపిల్లలతో వచ్చిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి దారుణంగా మారింది. పోలీసులు వచ్చి పరిస్థితిని కొంచెం చక్కదిద్దారు. పరిస్థితి విషమించడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తిరుమలలో రేపటి నుంచి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.