తిరుపతి జిల్లా కు మంత్రివర్గంలో "మొండిచెయ్యి" అని కాంగ్రెస్ నాయకులు, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. "తిరుపతి జిల్లా" పేరు గొప్ప మంత్రి పదవికి తక్కువ అన్నచందంగా నూతనంగా ఏర్పడ్డ జిల్లాను "ఉట్టికి స్వర్గానికి" కాకుండా చేసి జిల్లా ప్రజల ఆశలను "మూడునాళ్ళ" ముచ్చటగా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. తిరుపతి లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు 3 మంత్రి పదవులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం, బాధ్యతలు స్వీకరించిన మంత్రులను అభినందిస్తునాం కానీ తిరుపతి జిల్లాకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడాన్ని తిరుపతి జిల్లా వాసిగా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఖండిస్తున్నామని అని అన్నారు.
తిరుపతి జిల్లాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యత దృశ్య రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లా పరిధిలోని నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. తిరుపతి జిల్లా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా జిల్లా పరిదిని పరిగణలోకి తీసుకొని ఒకరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకుండా మొండిచేయి చూపారని తెలిపారు. తిరుపతి జిల్లాకు "స్మార్ట్ సిటీ" నిధులు సకాలంలో రావాలన్నా జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వారధిగా తిరుపతి జిల్లాకు చెందిన శాసనసభ్యులు మంత్రి వర్గంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తిరుపతి జిల్లా అభివృద్ధి ఇకపై "దింపుడు కళ్ళెం" ఆశ గా మారుతుందని చెప్పారు.
ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కిన అమాత్యులు నిధుల కేటాయింపులలో తమ నియోజక వర్గాలకే పరిమితమై "తిరుపతి జిల్లా" కు అన్యాయం చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రత్యేక రాయితీలతో పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు.