ప్రతీ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన 14 వరకు సముద్ర జలాల్లో మత్స్య సంపద వేట నిషేధం అమలవుతుంది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మత్స్య శాఖ అధికారులపైన, తీర ప్రాంత గస్తీ దళాల పైన ఉంటుంది. వేట విరామ సమయంలో నష్టపోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఆర్థిక సాయం చేస్తుంది.
విజయనగరం జిల్లాలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్లను మూడు రకాలుగా విభజించారు. సోనా బోట్లలో ఎనిమిదేసి మంది, మెకనైజ్డ్ బోట్లలో ఆరుగురు, ఇంజను బోట్లలో ముగ్గురు వంతున లబ్ధిదారులుగా పరిగణిస్తారు. చేపలను వేటాడే వారి వయసు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. చేపల వేట నిషేధ కాలంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బృందాలు ఆయా గ్రామాల్లో పర్యటించి అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారు.
గత ప్రభుత్వాల్లో అయితే వేట నిషేధ సమయంలో తొలుత బియ్యం పంపిణీ చేసేవారు. ఆ తర్వాత రూ.4 వేలు వంతున పరిహారం అందించేవారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా కాల పరిమితికి వేట నిషేధ సమయంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల వంతున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాలోకి జమ చేస్తున్నారు. సోనా బోట్ల రిజిస్ట్రేషన్ ఉన్న వారు ఎనిమిది మందికి రూ.80 వేలు, మెకనైజ్డ్ బోట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రూ.60 వేలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్య శాఖ జిల్లా అధికారులు హెచ్చరించారు. అర్హత కలిగిన అందరికీ ప్రభుత్వపరంగా సాయమందిస్తామన్నారు. శుక్రవారం నుంచి మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్య సంపద వృద్ధి కోసం అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరారు.