సినీ నటి సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ నేరగాళ్లు పట్టుబడ్డారు. ఇదిలావుంటే కొన్నివారాల కిందట ఢిల్లీలో బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ కు చెందిన నివాసంలో భారీ చోరీ జరగడం తెలిసిందే. రూ.2.41 కోట్ల విలువైన సొత్తును అపహరించారంటూ సోనమ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అసలు దొంగలెవరో పోలీసులు గుర్తించారు. ఓ నర్సు, ఆమె భర్తే ఈ నిర్వాకానికి పాల్పడ్డారని వెల్లడైంది.
అసలేం జరిగిందంటే... సోనమ్ కపూర్ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడారు. ఆనంద్ అహూజాకు ఢిల్లీలోని అమృతా షెర్లింగ్ మార్గ్ లో ఓ భారీ భవంతి ఉంది. ఇందులో ఆనంద్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. ఇదిలావుంటే ఆనంద్ తల్లి ప్రియ వృద్ధాప్యంలో ఉండడంతో ఆమెకు సహాయకురాలిగా ఉండేందుకు అపర్ణ రీతూ వెల్సన్ అనే నర్సును నియమించారు.
అయితే, ఆనంద్ అహూజా నివాసంలో ఉన్న సంపద చూసి అపర్ణలో దుర్బుద్ధి కలిగింది. వజ్రాల ఆభరణాలు, బంగారం, నగదు కొట్టేసేందుకు భర్త నరేశ్ కుమార్ తో కలిసి పథక రచన చేసింది. దాని ప్రకారం ప్రతి రోజు రాత్రివేళ ఆనంద్ తల్లి ప్రియకు మత్తుమాత్రలు ఇచ్చి, ఆపై ఇంట్లోనే ఉన్న సొత్తు కొద్దికొద్దిగా అపహరించడం ప్రారంభించింది.
ఆ చోరీ సొత్తును అపర్ణ భర్త నరేశ్ కుమార్ ఇతరులకు విక్రయించేవాడు. ఈ చోరీ తంతు కొన్ని నెలల పాటు సాగింది. అలా కొట్టేసిన సొమ్ముతో అపర్ణ దంపతులు తమ అప్పులు తీర్చుకున్నారు. అంతేకాదు, ఓ పాత కారును కూడా కొనుగోలు చేశారు. అయితే, పోలీసుల విచారణలో ఆ దంపతుల చోరీ వ్యవహారం బట్టబయలైంది. ప్రస్తుతం పోలీసులు నర్సు అపర్ణ, ఆమె భర్త నరేశ్ లను అరెస్ట్ చేశారు.