అమెరికా, యూకే, యూరప్ దేశాలు ఓ వింత వ్యాధి వ్యాప్తి కారణంగా అల్లాడిపోతున్నాయి. కోవిడ్‌తోనే కోలుకోలేకపోతుంటే.. మరో అంతుచిక్కని వైరస్ దాడి మొదలైంది. పలు దేశాల్లో ఇప్పటికే తెలియని వ్యాధితో చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. అమెరికా, యూకే, యూరప్‌లోని పలు దేశాల్లో పిల్లలు తెలియని వ్యాధితో ఆస్పత్రిపాలవుతున్నారు. యూకేలో హెపటైటీస్, లివర్ సంబంధిత సమస్యలతో 74 కేసులు నమోదయ్యాయి. అయితే పిల్లలకు సోకింది ఏ వ్యాధి అనేది తెలియడం లేదు. దీనిపై యూకే అధికారులు పరిశోధిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే జలుబుతో సంబంధం ఉన్న ఒక రకమైన వైరస్‌కు సంబంధించినదని అధికారులు భావిస్తున్నారు.
యూకేలోనే కాకుండా స్పెయిన్‌లో మూడు, ఐర్లాండ్‌లో కొన్ని కేసులు, యూఎస్ తొమ్మిది కేసులు నమోదయ్యాయి. పిల్లల్లో తలెత్తుతున్న ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి ఆయా దేశాల్లో వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ఒక నెలలో వెలుగులోకి వచ్చిన కేసుల పెరుగుదలతో చూస్తే.. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికాలో ఏడాది వయస్సు నుంచి ఆరేళ్లు వయస్సున్న పిల్లలకు వ్యాధి సోకింది. అందులో ఇద్దరికి కాలేయ మార్పిడి అవసరం పడింది. స్కాట్లాండ్‌లో కాలేయ సమస్యలతో బాధపడుతున్న పది మంది పిల్లలున్నారు. జనవరిలో ఒకరు, మార్చిలో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు హెపటైటిస్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. అప్పటి నుంచి బ్రిటిష్ ఆరోగ్య అధికారులు 64 కేసులను గుర్తించారు. అయితే ఇందులో ఎవరు చనిపోలేదు. కానీ వీరిలో ఆరుగురికి కాలేయ మార్పిడి అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
అయితే హెపటైటీస్ రకం ఏ, బీ, సీ, ఈ వైరస్‌లు ఇటువంటి అనారోగ్యాలకు కారణమవుతాయని వైద్యులు అంటున్నారు. కానీ ఇదెలా సోకుతుందనేదానిపై స్పష్టత లేదు. ఇటీవల అడెనోవైరస్‌లు వ్యాప్తి పెరిగినట్టు వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లల్లో అనారోగ్యానికి ఇది కారణం కావొచ్చని భావిస్తున్నారు. అలాగే ల్యాబోరేటరీ రిపోర్ట్స్‌లో ఇది హెపటైటిస్‌కి సంబంధించిన వ్యాధి కాదని తేలింది. కానీ దీనికి వెంటనే వైద్యం చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు అంటున్నారు. కాగా ఇప్పటికే కరోనాతో దేశాలన్నీ చితికిపోయాయి. చైనాలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కఠిన ఆంక్షల మధ్య అక్కడి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనాతో మరికొన్ని దేశాల్లో కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి నుంచి బయటపడటం కష్టంగా ఉంటే.. ఈ అంతుచిక్కని వ్యాధితో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే అందరిలో భయం నెలకొంది.