చైనా కు కరోనా వైరస్ సవాల్ విరుతుండగా..లాడ్ డౌన్ తో విసిగిన ప్రజల తిరుగుబాటు మరో సవాల్ గా మారింది. ఒక పక్క కోవిడ్... మరోపక్క ఆంక్షలతో కూడా చైనా ప్రజలు సతమతం అవుతున్నారు. కోవిడ్ కట్టడి కోసం చైనా ప్రభుత్వం అమలు చేస్తోన్న నిబంధనలతో విసిగిపోతున్నారు. ఇప్పటికే ఇళ్లకి పరిమితం అయిన ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. నిత్యావసరాల దొరకక.. డెలివరి ఫుడ్‌పై ఆధారపడి ఆర్తనాదాలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వం, అధికారులు వారి మొరను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో అక్కడి ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెరిగిపోయాయి. తాజాగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న షాంఘై నగర ప్రజలు అక్కడి పోలీసులపై తిరగబడ్డారు.
చాలారోజులుగా షాంఘైలో కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అధికారుల నిబంధనలతో సరైన ఆహారం కూడా దొరకక తిప్పలు పడుతున్నారు. కాళ్లను కట్టిపడేసినట్టు ప్రజలు ఎటూ కదల్లేని పరిస్థితి అక్కడ చోటుచేసుకుంది. కంపెనీలు మూతబడుతున్నాయి. ఉద్యోగాలు పోతాయేమోననే భయాందోళన అందరిలో నెలకొంది. ఈ క్రమంలో కోవిడ్ సోకిన వారి కోసం క్వారంటైన్‌లా మార్చడానికి అపార్ట్‌మెంట్స్‌లో ఇళ్లను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కోవిడ్ సోకిన వారిని అపార్ట్‌మెంట్లలో పెట్టేందుకు హజ్మత్ సూట్ దుస్తుల్లో పోలీసులు ఓ కాంపౌండ్‌ను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు.
దీంతో తమ ఇళ్లను వదిలిరామని స్థానికులు పోలీసులపై తిరగబడ్డారు. ఇళ్లను వదిలి ఎక్కడకి వెళ్లమని తెగసి చెప్పారు. అయినా పోలీసులు వినకపోవడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ మహిళ అరుస్తూ కనిపించింది. నిజానికి షాంఘైలో ఒక్కరోజులోనే వేలాదిగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నఆ మహానగరంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. కోవిడ్, కఠిన నిబంధనలతో అల్లాడుతున్న జనం తమ ఆవేదనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
అయితే కేవలం షాంఘై నగరంలోనే కాదు.. చైనా మొత్తం కోవిడ్ విజృంభిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎక్కువ కేసుల్లో ఎటువంటి లక్షణాలు ఉండడం లేదు. కాగా గవేకాల్ డ్రాగోనామిక్స్ అధ్యయనం ప్రకారం చైనాలో 87 నగరాల్లో కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కఠినమైన లాక్‌డౌన్ తట్టుకోవాలని, కొంత సంయమనం పాటించాలని ప్రజలకు అక్కడ అధికారులు పిలుపునిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం నిబంధనలతో విసిగిపోయారు. దాంతో అపార్ట్‌మెంట్లో బాల్కనీల్లో నించుని పెద్ద పెద్దగా కేకలు కూడా వేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.