రేషన్ పంపిణీకి బదులు కార్డు దారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసేందుకు నిర్ణయించింది.మే నెల నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద పథకాన్ని అమలు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లోని రేషన్ కార్డు దారులకు అప్షన్లు ఇచ్చి బియ్యానికి బదులు నగదు కావాలని కోరుకున్న వారి ఖాతాల్లో జమ చేస్తారు. ప్రజల స్పందన బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. ప్రతి కిలో రేషన్ బియ్యానికి రూ.15 వరకు నగదు బదిలీ ద్వారా ఖాతాల్లో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
వరి రైతులకు కష్ట కాలం..
రేషన్ బియ్యానికి బదులు నగదు ఇవ్వాలని గతంలోనే అనేక ప్రభుత్వాలు ఆలోచన చేసిన ఆచరణ సాధ్యం కాలేదు. కారణం రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని గత ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి. ప్రభుత్వ మద్దతు ధర పై ఆధారపడి చాలా వరకు రైతులు వరి పండిస్తుంటారు.ఈ వరిధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తుంది. ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా బియ్యంగా మరల్చి పౌరసరఫరాల శాఖ, ఎఫ్ సీఐ గోడౌన్లలో నిల్వచేసి అవసరం మేరకు వినియోగిస్తుంటారు. కాగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేషను నగదు బదిలీ చేస్తే గోడౌన్లలో బియ్యం నిల్వలు మిగిలిపోయి రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఇబ్బంది కలుగుతుంది. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకుంటే దళారులకు తక్కువ ధరకు రైతన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి. రేషన్ అక్రమాలకు చెక్ పెట్టాలని భావించి ప్రవేశపెడుతున్న నగదు బదిలీ రైతన్నకు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం వుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో గ్యాస్ సబ్సిడీ పథకంలాంటిదే..?
గ్యాస్ సబ్సిడీని వినియోగదారులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకం అమలు వినియోగదారులకు శాపంగా మారింది. రోజు రోజుకు గ్యాస్ ధర పెరిగిపోతున్నా - సబ్సిడీ మాత్రం రూ.15 లకు మించి ఖాతాల్లో జమ కావట్లేదు. ఈ సమస్యపై ఎవరిని సంప్రదించాలో అర్ధం కాని పరిస్థితి. రాష్ట్రంలో చాలా వరకు రేషన్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం లేదు. పది..పన్నెండు రూపాయలకు దళారులకు విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని వద్దనుకున్నవారికి ప్రభుత్వం కిలోకి రూ.15 నుండి రూ.16 చొప్పున ఖాతాల్లో జమ చేస్తానంటోంది. అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి ఇది ఎంత వరకు సాధ్యమనే ప్రశ్నలు విజ్ఞులు లేవనెత్తుతున్నారు. తద్వారా రేషన్ బియ్యం వద్దనుకుని ఆప్షన్ ఇచ్చిన కార్డుదారులకు బియ్యం రాక.. ఖాతాల్లో నగదు జమ కాకుంటే ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేసేందుకు రూ.35 వరకు వెచ్చిస్తున్నట్లు పేర్కొంటున్నారు. రేషన్ నగదు బదిలీపై ప్రభుత్వం జమ చేస్తానంటున్న రూ.16.. రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుందా లేక కేంద్రమా స్పష్టత రావాల్సి ఉంది.
డీలర్లు,ఎండియు వాహనాలు ఇక ఇంటికే..?
రేషన్ పంపిణీ కోసమే ఏర్పాటు చేసిన డీలర్ల వ్యవస్థ క్రమంగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది.రేషన్ కు నగదు బదిలీ ద్వారా చాలా వరకు కార్డు దారులు నగదు బదిలీ ఆప్షన్ ఎంచుకుంటే డీలర్లతో పనే లేకుండా పోతుంది. నేరుగా ఖాతాల్లో నగదు జమ చేస్తే డీలర్ల వ్యవస్థతో అవసరం వుండదు. అదేవిధంగా వందల కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ఎండియూ వాహనాలు, ఆపరేటర్ల వ్యవస్థ కూడా ప్రశ్నార్థకంగా మారనుంది.