ఏపీలోని చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన చిన్నారి కథ సుఖాంతమైంది. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవితల కుమార్తె జోషిక(4) శనివారం అదృశ్యమైంది. ఇంటి వద్ద ఆడుకుంటుందని తల్లిదండ్రులు భావించారు. అయితే అకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పలు చోట్ల గాలింపు చేపట్టారు. కిడ్నాప్ కోణంలో విచారణ చేపడుతుండగా, బాలిక దుస్తులను డాగ్ స్క్వాడ్‌కు చూపించారు. దీంతో జాగిలాలు అడవిలోకి వెళ్లి ఆగాయి. అడవిలో పోలీసులు, కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు బాలిక ఆచూకీ సోమవారం లభించింది. మూడు రోజుల పాటు అడవిలో ఆ బాలిక ధైర్యంగా ఉందని అంతా ప్రశంసించారు. ఆడుకుంటూ అనుకోకుండా అడవిలోకి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. మూడు రోజులుగా ఏమీ తినకపోవడం, మరో వైపు మండుతున్న ఎండల కారణంగా ఆ పాప ఎంతో నీరసించిపోయింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.